జోధ్‌పూర్(రాజస్థాన్): సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సిఆర్‌పిఎఫ్ జవాను సోమవారం ఉదయం తన క్వార్టర్స్‌లో తన భార్యాపిల్లల సమక్షంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడి పాల్డీ ఖిన్చియాన్‌లోని సిఆర్‌పిఎఫ్ ట్రెయినింగ్ సెంటర్ ప్రాంగణంలో ఉన్న సిఆర్‌పిఎఫ్ నివాస క్వార్టర్స్‌లో ఈ దారుణం జరిగింది. ఆదివారంఒక్కరోజు తనకు సెలవు కావాలని నరేష్ జాట్ అనే జవాను కోరగా డిఐజి అందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన నరేష్ తన భార్యా పిల్లలతో కలసి తన క్వార్టర్స్‌లో తలుపులు లాక్ చేసుకుని ఉండిపోయాడు. ఆదివారం సాయంత్రం బాల్కనీలోకి వచ్చిన అతను తన చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అతనికి నచ్చచెప్పడానికి అధికారులు ఆదివారం రాత్రంతా ప్రయత్నించగా తాను అదే రైఫిల్‌తో ఆత్మహత్య చేసుకుంటానని అతను వారిని బెదిరించాడు. అతని కోరిక ప్రకారం ఐజిని కూడా అక్కడకు రప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాని సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నరేష్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. మృతుడు ఉపయోగించిన రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి దుహన్ తెలిపారు.