మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. బుధవారం(జులై 13) రోజున జరగాల్సిన ఇసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఇప్పటికే వాయిదా వేయగా, గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌ను యధాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మంగళవారం రాత్రి వరకు వర్షాలు తగ్గకపోగా, మరికొన్ని రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌ను కూడా వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, 18 నుంచి 20 వరకు అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతారని కాబట్టి వాయిదా వేయడమే మేలని భావిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై బుధవారం ప్రభుత్వ వర్గాలతో చర్చించి ఎంసెట్ వాయిదాపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది.