ఫిరాయింపుల నిలయంగా, బిజెపి తుచ్ఛ కుట్రల స్థావరంగా నిరూపించుకొన్న గోవాలో మరోసారి కమలనాథుల చేతివాటం కలకలం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలలోని మూడింట రెండొంతుల మందిని కలుపుకోడానికి యీసారి బిజెపి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఈ కుట్రకు సహకరించిన యిద్దరి సభ్యత్వాల రద్దుకు కాంగ్రెస్ సిఫారసు చేసింది. వీరిలో వొకరైన దిగంబర్ కామత్ మాజీ ముఖ్యమంత్రి, రెండో సభ్యుడు మైఖేల్ లోబో. ఈయన కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు. కామత్ నాయకత్వంలో అయిదుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ఆదివారం నాడు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలవడంతో జాగ్రత్తపడిన కాంగ్రెస్ ఫిరాయింపుల చట్టం కింద వీరిద్దరి సభ్యత్వాలను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ స్పీకర్‌కు లేఖ రాసింది.
నాలుగు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ యెన్నికల్లో బిజెపికి 20 స్థానాలు, కాంగ్రెస్‌కు 11 వచ్చాయి. శాసనసభ బలం 40. సాధారణ మెజారిటీకి వొక్క స్థానం తక్కువగా వచ్చిన బిజెపి అధికారాన్ని చేజిక్కించుకొన్నది. ఇద్దరు సభ్యులున్న మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, ముగ్గురు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రమోద్ సావంత్ రెండోసారి ప్రభుత్వాన్ని యేర్పాటు చేశారు. 2017 శాసనసభ యెన్నికల తర్వాత గోవాలో బిజెపి నడిపించిన ఫిరాయింపుల పర్వం వ్యాపింపజేసిన దుర్గంధం అంతా యింతా కాదు. ప్రజల తీర్పును, అది వెలువడిన మరు క్షణమే బాహాటంగా పొడిచి చంపింది. ప్రజాస్వామ్యాన్ని, వోటును, యెన్నికల ప్రక్రియను పట్టపగలు పరిహసించింది. కేంద్రంలోని అధికార బలంతో దొడ్డిదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నది.
ఆ యెన్నికల్లో 17 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని పొందింది. బిజెపికి 13 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఏమరుపాటులో ఉండగా దానికి చెందిన 12 మంది సభ్యులను పార్టీలో కలుపుకొని బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలు, వాటి నాయకులు స్వార్ధం కోసం, అడ్డదారిలో అధికారం కైవసం చేసుకోడానికి యెన్ని దుర్మార్గపు వేషాలు వేసి ఫిరాయింపుల నీచ రాజకీయాన్ని యెంతగా నడిపించినా ప్రజలు మాత్రం తాము తీర్పు యివ్వాల్సి వచ్చిన సమయంలో ఫిరాయింపుదార్లకు తగిన బుద్ధి చెబుతూనే వున్నారు. 2022 ఫిబ్రవరి -మార్చిలో జరిగిన గోవా యెన్నికల్లో అక్కడి ప్రజలిచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం.
2017 యెన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి ప్రజల తీర్పుకి తూట్లు పొడిచిన 12 మంది ఎమ్‌ఎల్‌ఎలలో 9 మంది 2022 యెన్నికల్లో వోడిపోయారు. ఈ గుణపాఠం కళ్ళ ముందు వున్నప్పటికీ మళ్లీ బిజెపిలోకి ఫిరాయించడానికి కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు సాహసించడం ఆందోళనకరం. గోవాలో బిజెపి తాజా పన్నాగానికి తాత్కాలికంగా బ్రేకు పడినా దాని దుర్బుద్ధి ఆగదు. మళ్ళీ గాలం వేయక మానదు. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని ఫిరాయింపుల చట్టబద్ధంగా చీల్చక మానదు. కేంద్రంలోని పాలకపక్షం తన చేతిలో గల ఎదురులేని అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యం గుండెల్లో బాకులు గుచ్చే దారుణాన్ని ఇకనైనా ప్రభావవంతంగా ఆపాలి. కేంద్ర పాలకపక్షం అవసరాలకు, అభీష్టాలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులిస్తూ రాజ్యాంగం పట్ల నయవంచకత్వం ప్రదర్శిస్తున్నాయన్న విమర్శకు గురి అవుతున్న న్యాయస్థానాలకు సైతం సందివ్వని రీతిలో ఫిరాయింపుల నిరోధ చట్టానికి కట్టుదిట్టమయిన సవరణ తీసుకురావలసి వుంది.
అయితే ఆ పని చేయవలసింది కూడా యిప్పుడున్న కేంద్ర పాలక పక్షం బిజెపియే. కాబట్టి అది తన దుష్ట క్రీడకు తానే తెర దింపుకుంటుందనుకోడం అత్యాశే అవుతుంది. యే లోక్‌పాల్ ఉద్యమం ఆసరాతో తాను దేశాధికారాన్ని పొందిందో అదే లోక్‌పాల్ వ్యవస్థ డిమాండ్‌కు శాశ్వత సమాధి కట్టిన చరిత్ర బిజెపి ది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల సభ్యత్వాలను ఫిరాయింపుల చట్ట నిబంధనల కింద రద్దు చేయాలని ఆ పార్టీ చేసిన సిఫారసుపై గోవా స్పీకర్ యేమి చేస్తారో చూడాలి. ఇటువంటి సిఫారసుల మీద స్పీకర్లు సంవత్సరాల పాటు నిర్ణయం తీసుకోకుండా ఉన్న సందర్భాలున్నాయి. మణిపూర్‌లో 2017 అసెంబ్లీ యెన్నికలు ముగిసిన తర్వాత స్వల్పకాలంలోనే యేడుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు బిజెపిలో చేరారు.
అందులో వొకరు బిజెపి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ మంత్రి శాసన సభ్యత్వాన్ని ఫిరాయింపుల చట్టం కింద రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సిఫారసుపై రెండేళ్లు గడచినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దానితో 2020 జనవరిలో సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించింది.అప్పటికీ నిర్ణయం తీసుకోకపోడంతో సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగి తన ప్రత్యేకాధిరాలను ప్రయోగించింది. ఫిరాయించిన సభ్యుడిని మంత్రి పదవి నుంచి తొలగించి, అతడు శాసనసభలో అడుగు పెట్టరాదని ఆదేశించింది. ఇప్పుడు గోవా అసెంబ్లీ స్పీకర్ ఏమి చేస్తారో చూడాలి.