ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ… 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్)తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బూస్టర్ డోసు ఇస్తే రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని సూచిస్తున్నాయని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు.
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒకడోసు తీసుకోగా, 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్ డోసుగా పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం పైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దేశంలో 77 కోట్ల మంది ఈ వయసు వారుండగా, అందులో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్ డోసును తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారితోపాటు ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16 కోట్లు ఉండగా, వారిలో 26 శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును తీసుకోవచ్చు.