తాగునీటి నాణ్యతను పరీక్షించిన దానకిషోర్
కలుషిత నీరు సరఫరా కాకుండా మూడంచెల క్లోరినేషన్
5లక్షల క్లోరిన్ బిల్లల పంపిణీ, మరో 5లక్షల బిల్లలు సిద్దం
నిరంతరం అందుబాటులో 16మాన్‌సూన్ సేప్టీ టీమ్‌లు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వానలకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశించారు. బుధవారం బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు. సరైనా నాణ్యతతో నీటి సరఫరా అవుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి నీటి సరఫరా ఎలా జరుగుతుందో ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున తాగునీటి నాణ్యతపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారిందని, ఈసమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల క్లోరిన్ ప్రక్రియను అవలంబిస్తున్నామని, మొదటి విడతగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల వద్ద క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతున్నామని, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ చేస్తున్నట్లు , చివరిగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, శుద్దమైన నీరు అందించేందుకు ఐఎస్‌ఓ 105002012 ప్రకారం శాస్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జలమండలి తీసుకుంటుందని, ప్రతి రోజు నగర వ్యాప్తంగా 15వేల క్లోరిన్ పరీక్షలు చేస్తోందన్నారు. నగరంలో బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు, ఈప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకు ప్రజలు ఇళ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతపై కూడా దృష్టిపెట్టినట్లు తెలిపారు. నిల్వచేసిన నీటిని శుద్ది చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిల్లలను పంపిణీ చేస్తున్నట్లు, వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు జలమండలి 5 లక్షల క్లోరిన్ బిల్లలను పంపిణీ చేసిందన్నారు. మరో 5 లక్షల క్లోరిన్ బిల్లలను పంపిణీకి సిద్దంగా ఉంచినట్లు, క్లోరిన్ బిల్లలను ఉపయోగించి నీటిని ఎలా శుద్ది చేసుకోవాలనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధుల నివారణకు జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
16మాన్‌సూన్ సేప్టీ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు, ఒక టిమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఈటీమ్‌లకు ప్రత్యేక వాహనాలు 24గంటల పాటు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడైనా నీరు నిలిస్తే వెంటనే వెళ్లి నీటిని తొలగించేందుకు ఈవాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీవాటర్ మోటర్ ఉంటుందన్నారు. వర్షపు నీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఈబృందాలు వెంటనే ఆటంకాలను తొలగించి నీరు వెళ్లిపోయేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. నీరు నిలిచే ప్రాంతాలపై ఈబృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాయని, వీటితో పాటు మరో 16 మినీ ఎయిర్‌టెక్ వాహనాలను కూడా 24గంటల పాటు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్దితుల్లో మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని, తెరవడం జలమండలి యాక్ట్‌లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్‌హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. మ్యాన్‌హోల్ మూత ధ్వంసం అయినా తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్ 155313 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.