Saturday, November 23, 2024

మారకపు కరెన్సీగా రూపాయి!

- Advertisement -
- Advertisement -

Corona again in india డాలరు దాడిని తట్టుకోడానికి అంతర్జాతీయ లావాదేవీల్లో మారకపు కరెన్సీగా రూపాయిని వినియోగించే పద్ధతిని భారత రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టింది. ఈ కొత్త దారిలో వోస్త్రో ఖాతా ప్రధానమయిన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు మనం ఫలానా దేశం నుంచి పరస్పర అంగీకారం మీద యేదయినా సరకును దిగుమతి చేసుకోదలిస్తే అక్కడి అనుమతి పొందిన అకౌంటులో ఈ ఖాతాను తెరిచి ఆ సరకు విలువను రూపాయిల్లో అందులో జమ చేయాలి. అప్పుడు అక్కడి వ్యాపార సంస్థ ఆ రూపాయల విలువకు సమానమయిన సరకును మన దేశంలోని సంబంధిత సంస్థకు పంపిస్తుంది. అలాగే మన దేశం నుంచి దిగుమతి చేసుకోదలిచే యితర దేశంలోని వాణిజ్య సంస్థ ఇక్కడ అనుమతి పొందిన బ్యాంకులో వోస్త్రో ఖాతాను తెరిచి ఆ కిమ్మత్తు రూపాయలను జమ చేసి ఆ సరకును దిగుమతి చేసుకోవాలి.

ఈ మార్గంలో జరిగే వాణిజ్యం వల్ల మనం చేసుకొనే దిగుమతులకు డాలర్లను చెల్లించనవసరం వుండదు. అయితే యీ విధమయిన అంతర్జాతీయ రూపాయి మారక వ్యవస్థను అన్ని దేశాలూ అంగీకరించే అవకాశాలు లేవు. ఒకప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్‌ను రూపాయి మారకం ద్వారా విరివిగా కొనుగోలు చేశాము. ఆ రూపాయిలతో ఇండియా నుంచి తనకు కావలసిన సరకులను కూడా ఇరాన్ కొనుక్కొని దిగుమతి చేసుకునేది. అమెరికా ఆంక్షలను యెదుర్కొంటున్న దేశాలు తమ సరకులను ఇండియాకు అమ్ముకోడానికి యీ దారి బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం డాలరుతో విదేశీ వ్యాపారం చేసే అవకాశాలు మూసుకుపోయిన దేశాలు అంటే ఇరాన్, రష్యా, శ్రీలంక రూపాయి మారక వ్యవస్థను ఆశ్రయించే అవకాశాలు బాగా వున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వం ఆర్ధిక ఆంక్షలు పునరిద్ధరించడంతో ఇండియాకు అది రూపాయిలు తీసుకొని ఆయిల్‌ను యెగుమతి చేయడానికి అంగీకరించింది. సులువైన షరతులతో, రవాణా చార్జీలు తానే భరించి ఆయిల్‌ను మనకు పంపించేది. లావాదేవీలన్నీ మన రూపాయి, ఇరాన్ రియాల్ మధ్యనే సాగేవి.

$ 22 billion foreign investment

అయితే ట్రంప్ గుడ్లురిమేసరికి మోడీ ప్రభుత్వం ఇరాన్ నుంచి ఆ సదుపాయంపై ఆయిల్ దిగుమతిని దాదాపు మానివేసింది. రూపాయి, రియాల్ మారకంపై ఆయిల్ దిగుమతులు సాగినప్పుడు 2018-19లో ఇరాన్ నుంచి 23.9 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిలును ఇండియా దిగుమతి చేసుకొన్నది. రెండు దేశాల మధ్య ఆ యేడాది జరిగిన వ్యాపారం విలువ 16 బిలియన్ డాలర్లు. ట్రంప్ భయపెట్టిన తర్వాత 2020-21లో యిది 2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌తో వొబామా ప్రభుత్వం అణ్వస్త్ర తయారీ రహిత ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత దానిపై ఆంక్షలు తొలిగాయి. ట్రంప్ దానిని రద్దు చేయడంతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు అమెరికాలో డెమోక్రాట్‌ల ప్రభుత్వం అధికారంలో వున్నది. ప్రెసిడెంట్ జో బైడెన్ ఇరాన్‌తో పూర్వపు ఒప్పందాన్ని మళ్ళీ కుదుర్చుకొనే అవకాశాలున్నాయి. అందుచేత పూర్వం మాదిరిగా రూపాయలు తీసుకొని ఆయిల్‌ను యివ్వడానికి ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోపై అమెరికా ఆంక్షలు విరుచుకుపడ్డాయి. రష్యన్ రూబుల్‌ను డాలరు అనుసంధాన అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అమెరికా తప్పించింది.

పర్యవసానంగా రష్యా తన ఆయిల్‌ను పూర్వమంత స్వేచ్ఛగా అమ్ముకొనే అవకాశాలు తగ్గిపోయాయి. తనకు అనుకూలమైన దేశాలకు సులభ షరతులపై ఆయిల్‌ను అమ్మడానికి రష్యా సిద్ధపడింది. అటువంటి దేశాల కరెన్సీలను అంగీకరించడానికీ వెనుకాడడం లేదు. రష్యాతో పూర్వం నుంచీ గల సత్సంబంధాలను దృష్టిలో వుంచుకొని ఇండియా జాగ్రత్తగా అడుగు వేసింది. దేశ ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయం తీసుకొన్నది. దానితో రష్యా నుంచి చౌకగా ఆయిల్ దిగుమతులకు అవకాశాలు బాగా పెరిగాయి. ఒకప్పుడు మన అవసరాల్లో వొక శాతం క్రూడ్‌నే రష్యా నుంచి దిగుమతి చేసుకొనేవాళ్ళం. ఇప్పుడది 5 శాతానికి పెరిగింది. చవుకగానూ వస్తున్నది. ఇంతకు ముందు ఇండియాకు అత్యధికంగా ఆయిల్ యెగుమతి చేసే దేశాల్లో ఇరాక్ మొదటి స్థానంలో, సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉండేవి.

ఇప్పుడు సౌదీ స్థానాన్ని రష్యా ఆక్రమించిందని వార్తలు చెబుతున్నాయి. ఆయిల్, తదితరాల దిగుమతికి డాలర్ డబ్బు సంపాదించలేక దేశాధ్యక్షుడే ప్రవాసానికి పారిపోయిన శ్రీలంక మన షరతుల మీద మన వస్తువులు కొనుక్కోడానికి సిద్ధంగా వుంటుంది. మనకు ఎగుమతులు చేసే మరేదేశమైనా రూపాయిని అంగీకరిస్తే గొప్ప విషయమే. మన డాలరు అవసరాలు తగ్గి దానితో రూపాయి విలువ యింకా దిగజారిపోకుండా వుంటుంది. అయితే దాని వల్ల చెప్పుకోదగిన ప్రయోజనం వుండదని నిపుణులు భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనమేనని, డాలరు మళ్ళీ విజృంభిస్తుందని చెబుతున్నారు. ప్రధాని మోడీ మత తత్వానికి కొంతకాలం విరామమిచ్చి దేశ యెగుమతులను పెంచడంలో తన సత్తా చూపినప్పుడే డాలరు అదుపులోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News