Monday, December 23, 2024

బిసుగిర్‌షరీఫ్, ఉప్పల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పూర్తి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాజీపేట, బల్లార్షా రైల్వే మార్గంలో మూడవ లైన్ పూర్తి కావడంతో సరుకు, ప్రయాణికుల రైళ్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్ అన్నారు. రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తి కావడంలో కృషి చేసిన సికింద్రాబాద్ డివిజన్ కన్‌స్ట్రక్షన్ విభాగం బృందాలను ఆయన అభినందించారు. మూడవ లైను పనుల నిర్వహణలో ప్రాజెక్టు మొత్తం పనులను వేర్వేరు సెక్షన్లలో ఏకకాలంలో చేపట్టడం జరిగిందన్నారు.
దక్షిణ భారత్‌తో ఉత్తర భారత్‌కు అనుసంధానం..
దక్షిణ మధ్య రైల్వే బిసుగిర్‌షరీఫ్, ఉప్పల్ మధ్య 20 కిమీల మేర విద్యుదీకరణతో సహా మూడో రైల్వేలైన్ పనులను పూర్తి చేశారు. కాజీపేట నుంచి బల్లార్షా మూడో రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తి చేశారు. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులలో ఇది ఒకటి. దక్షిణ భారతదేశంతో ఉత్తర భారతదేశాన్ని అనుసంధానించే క్రమంలో కాజీపేట. బల్లార్షా మధ్య సెక్షన్ కీలకమైంది. ఈ సెక్షన్‌లో ఇప్పుడు 104 కిమీల మేర విద్యుదీకరణతో సహా మూడవ రైల్వేలైను పనులు పూర్తి చేశారు.దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట, బల్లార్షా సెక్షన్ తెలంగాణ,మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లు నిరాటంకంగా సాగుతూ రద్దీగా ఉండే ఈ ప్రధాన రైల్వే లైను గ్రాండ్ ట్రంక్ మార్గంగా ఉంది.

ఈ కీలక సెక్షన్‌లో రద్దీ నివారణకు తొలుతగా రాఘవాపురం నుంచి మందమర్రి మధ్య 33కిమీల మేర మూడవ రైల్వే పనులు 2016లో పూర్తి అయ్యాయి. ఇక్కడ రవాణా మరింత సులభతరం కావడానికి కాజీపేట నుంచి బల్లార్షాలోని మిగిలిన భాగంలో 202 కిమీల మేర (తెలంగాణలో 159 కిమీలు, మహారాష్ట్రలో 43 కిమీలు) మూడవ రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు రూ.2,063 కోట్ల అంచనా వ్యయంతో 2015-16లో మంజూరు చేశారు. ఇందులో భాగంగా పోట్కాపల్లి, రాఘవాపురం మధ్య 32 కిమీలు, విరూర్, మానిక్‌ఘర్ మధ్య 19 కిమీలు పనులు గతంలోనే పూర్తిచేశారు. తెలంగాణ పరిధిలోని వచ్చే 159 కిమీలలో బిసుగిర్‌షరీఫ్ నుంచి ఉప్పల్ మధ్య 20 కిమీల మేర మూడవ రైల్వే లైను పనులు పూర్తిచేశారు. ఈ పనులు కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలోకి వస్తాయి. మూడో లైను ఏర్పాటుతో ఈ గ్రాండ్ ట్రంక్ మార్గంలో సరుకు, ప్రయాణికుల రైళ్లు రద్దీ లేకుండా సజావుగా సాగునున్నాయి.

3rd Railway Line between Kazipet-Balharshah Completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News