Saturday, November 23, 2024

ఈ నెల 18 తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం

- Advertisement -
- Advertisement -

Chance of heavy rain again after 18th

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్‌లో జూలై 7వ తేదీ నుంచి 13వరకు
278 శాతం వర్షపాతం నమోదు
రికార్డు బ్రేక్ చేసిన నగరం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 18 తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. అనేక జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమాయి. గురువారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టగా శుక్రవారం హైదరాబాద్‌లో ఎండ కాస్తోంది. అక్కడక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఐదు రోజులుగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సీజన్‌లో మొదటిసారిగా నగరంలో కురిసిన వర్షం సాధారణం కంటే అధికంగా నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 278 శాతం వర్షపాతం నమోదైంది.

గతం కన్నా 57 శాతం అధికం

వాతావరణ శాఖ-హైదరాబాద్ సమాచారం ప్రకారం, నగరంలో గత సంవత్సరం జూలై నెలలో 38 శాతం వర్షపాతం నమోదు కాగా, ఈ సారి ఏకంగా జూలై నెలలో 144.2 మిమీ అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది గతంలో కురిసిన వర్షపాతం కంటే రెండు రెట్లు అధికమని అధికారులు తెలిపారు. గత సంవత్సరం జూన్ 1 నుంచి జూలై 13 వరకు నగరంలో సాధారణం కంటే 175 మిమీల వర్షపాతం నమోదు కాగా, ఈ సంవత్సరం అదే తేదీల్లో 278 మిమీ అధిక వర్షపాతం 57 శాతం అధికంగా నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

రెడ్‌జోన్ నుంచి పలు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్‌లోకి…

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు పలు జిల్లాలు అత్యంత భారీ వర్షాలు కురిసే రెడ్ జోన్‌లో ఉండగా గురువారం సాయంత్రం నుంచి ఆరెంజ్ అలర్టులోకి మారాయి. కొన్నిచోట్ల అతి భారీ, ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం, రాష్ట్ర ప్లానింగ్ సొసైటీలు వేర్వేరు బులెటిన్‌లో పేర్కొన్నాయి.

నేడు ఉదయం వరకు పలు జిల్లాలో సాధారణ…

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని, మధ్యాహ్నం నుంచి సాధారణ స్థాయికి చేరుకుని ఎల్లో అలర్ట్‌లోకి వెళ్లిపోతుందని వాతావరణ శాఖ వివరించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, భువనగిరి, సిద్దిపేట తదితర జిల్లాల్లో మాత్రం గాలులు 40 కి.మీ. వేగం వరకు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం వరకు నిర్మల్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్ అర్భన్ రూరల్, సిద్దిపేట, భువనగిరి, కామారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆదివారం తక్కువ తీవ్రతతో…

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి తక్కువ తీవ్రతతో వానలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల ఎల్లో అలర్ట్‌కు తగ్గిస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. హైదరాబాద్‌లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, గరిష్టంగా రెండు సెంమీలు కూడా కురవకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే బలపడి ఉన్నా అది ఆగ్నేయ దిశగా మరింతగా సముద్రంలోకి వెళ్లిపోతూ ఉందని, అందువల్లనే వర్షాల ప్రభావం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News