పూర్తిస్థాయి సవరణలతో ప్రెస్ బిల్లుకు సిద్ధం
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ మీడియాపై పూర్తి స్థాయి కట్టడికి రంగం సిద్ధం అయింది. సామాజిక మాధ్యమాలు బహుళ ప్రచారం పొందుతున్న దశలో భారతీయ చట్టం పాలనా వ్యవస్థల ధిక్కరణలకు పాల్పడటం జరిగితే, ఉల్లంఘనలకు దిగితే చట్టపరమైన చర్యలకు గురి కావల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని చర్యలతో కూడిన చట్రంలో ఇమిడ్చిన చట్టసవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం ఆరంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో తీసుకువస్తుంది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ డిజిటల్ మీడియాకు నిర్వహక మంత్రిత్వశాఖగా ఉంటుంది. ఇప్పటివరకూ భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చే నిబంధనలు భారతీయ చట్టాల పరిధిలో నిర్థిష్టంగా లేవు. అయితే తొలిసారిగా ఈ మీడియా రిజిస్ట్రేషన్ , సంబంధిత నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చేలా ఉండే సవరణల బిల్లు కీలకం కానుంది. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లు సవరణలపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ దృష్టి సారించింది.
ఎటువంటి ఎలక్ట్రానిక్ సాధన ప్రక్రియలతో అయినా నిర్వహించే ఎటువంటి డిజిటల్ మీడియాలోని వార్తలపై , అంశాలపైనా సరైన నియంత్రణ ఉంటుంది. ఉల్లంఘనలకు దిగినట్లు నిర్థారణ అయితే నిర్థిష్ట చర్యలకు అధికారులు దిగేలా ఉండేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇకపై పత్రికలు ప్రింట్ మీడియా మాదిరిగానే డిజిటల్ మీడియా కూడా ఈ చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల వ్యవధిలోనే నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సి ఉంటుంది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయంలో ఈ నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఉల్లంఘనలకు దిగే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ పరిధిలోకి రాకుండా డిజిటల్ మీడియాను నిర్వహిస్తే వాటిని నిలిపివేయడం , దీనితో పాటు తగు విధంగా జరిమానాలకు దిగడం జరుగుతుంది. 2019లో డిజిటల్ మీడియా నియంత్రణకు యత్నించారు. కొత్త ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) నిబంధనల పరిధిలోకి డిజిటల్ మీడియాను తీసుకువచ్చేందుకు చేపట్టిన యత్నాల పట్ల నిరసన వ్యక్తం అయింది. వివాదం రగులుకుంది.