మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశా నిర్దేశం చేసేందుకు టిఆర్‌ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపిలకు పిలుపునివ్వనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో పార్టీ ఎంపిలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. రాష్ట్రానికి అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తెలియజేయాల్సిన నిరసన… పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని కోరుతూ ఎంపిలకు సిఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఆర్ధిక క్రమశిక్షణతో అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న మోడీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలపై ఉభయ సభల్లో బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే విధంగా వ్యూహాలను నేటి సమావేశంలో ఖరారు చేయనున్నారు. అలాగే వ్యవసాయం, సాగునీరు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణతో అనతికాలంలోనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రానికి చేయూతనివ్వకుండా రైతులను, మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాడే విధంగా ఎంపిలకు సిఎం పిలుపు నివ్వనున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సూచించినున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో గొప్పగా అమలు జరుగుతున్న తీరు గురించి కేంద్రమే పలుమార్లు ప్రశంసించి పలుమార్లు అవార్డులు…రివార్డులు ఇచ్చిందని….కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాట మార్చి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తును తీరును కూడా ఉభయ సభలో ఎండగట్టాలని ఎంపిలకు కెసిఆర్ కూలంకషంగా వివరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రోజు రోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చేస్తున్న అంశంపై పార్లమెంట్ వేదికగా మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎంపిలకు ఈ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. దేశ అభివృద్ధి సూచి రోజు రోజుకూ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకర పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా రాష్ట్ర ప్రజలకున్నదని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా రూపాయి పతనంపై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సిఎం కెసిఆర్ ఎంపీలకు సూచించనున్నారు.
అదే సందర్భంలో పాలనలోనే కాకుండా రాజకీయ, సామాజిక తదితర అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్యధోరణి వల్ల దేశంలో రోజు రోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం పొందుపరిచిన ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పేవిధంగా ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్‌ఎస్ చేస్తున్న పోరాటంలో భాగంగా కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపిలను కూడా కలుపుకుని రాష్ట్ర, దేశ ప్రజల పక్షాన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్వ్ర అసంబద్ధ విధానాలను గట్టిగా నిలదీయాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వనున్నారు.