Friday, November 22, 2024

‘పక్కా’ 90 సీట్లు.. హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

TRS will win more than 90 seats in upcoming elections

టిఆర్‌ఎస్‌కు ఉన్న ప్రజాధారణకు
ప్రతిపక్షాల సర్వేలే నిదర్శనం రాష్ట్రం
పట్ల మోడీకి అంతులేని వివక్ష
గుజరాత్‌కు వరదలొస్తే భారీగా నిధులు
తెలంగాణకు పైసా విదల్చని కేంద్రం
బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్
అంటే మోడీ, ఇడీ గడువు ప్రకారమే
ఎన్నికలు వాళ్లు కోరితే ముందస్తుకు
సిద్ధం మీడియాతో చిట్‌చాట్‌లో
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్

ప్రజాస్వామ్య పద్ధతిలో
కొనసాగుతున్న ప్రభుత్వాలను కూల్చుతాం.. చీల్చుతాం అని బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు వారి అహంకారానికి నిదర్శనం. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అప్రజాస్వామ్యంగా కూల్చారు.

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా సరికొత్త చరిత్రను సృష్టించడం తథ్యమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆయన ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సిఎం కావడం ఖాయమన్నారు. ఇందుకు బిజెపి, కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలన తరువాత ప్రజల నుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లభిస్తున్న స్పందనకు నిదర్శనమన్నారు. సిఎం కెసిఆర్ పాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిలువుద్దమని వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కెటిఆర్ అనేక అంశాలపై స్పందించారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఊటంకిస్తూనే… తనదైన శైలిలో ఆయా పార్టీలు, నాయకులపై సెటైర్లు వేశారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 90కి పైగా స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో తేలిందన్నారు. టిఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమనే సంకేతాలు చాలా బలంగా ఉండడం వల్లే ఇప్పటి నుంచే పార్టీ నాయకులు టికెట్ల వేటలో పడ్డారన్నారు. అందుకే పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొని ఉందన్నారు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పుడు ఇలాంటి తగాదాలు చాలా సహజమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అయితే వాటిని వీలైనంత వరకు పరిష్కరిస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీ ఎవరిని ఒదులుకోబోదన్నారు.

అలాగే బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని….సమర్దులైన వారికి, గెలిచే సత్తా ఉన్న వారికే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. అందరి సేవలను వినియోగించుకుని మరోసారి విజయం సాధించడమే తమ లక్షమని కెటిఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర స్థాయిలో పూర్తిగా బలంగా ఉంది టిఆర్‌ఎస్సే అని…. చాలా జిల్లాలో విపక్ష పార్టీలకు సరైన అభ్యర్ధులు కూడా లేరన్నారు. అందువల్ల తమ ప్రత్యర్ధి ఎవరన్నది స్పష్టంగా చెప్పడం సాధ్యపడదన్నారు.

గుజరాత్‌కే మోడీ ప్రధాని

మోడీ దేశానికి కాకుండా గుజరాత్‌కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. మానవత్వం ఉన్న ప్రధాని అయితే వరదలు వచ్చినపుడు ముందస్తు సాయం అందించాలన్నారు. హైదరాబాద్‌లో వరదలొస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కానీ గుజరాత్‌కు ఇప్పటికే రూ.వెయ్యికోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు. ఒక ప్రధానమంత్రికి ఉండాల్సిన వివక్షేనా? అని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల ఆయనకు సమానం కాదా? కెటిఆర్ నిలదీశారు. గుజరాత్ ప్రజలను కేంద్రం ముందుకు వచ్చి ఆదుకున్నట్లుగా తెలంగాణ ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదన్న విషయాన్నే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఆ రాష్ట్రాని వెయ్యి కాదు…రెండువేల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం కూడా వరదలతో అల్లాడుతోందన్నారు. మరి మా (తెలంగాణ) రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి మోడీ ఎందుకు మనస్సు రావడం లేదని కెటిఆర్ మండిపడ్డారు.

కాగా ప్రైవేట్ పర్యటనకు వచ్చిన ప్రధానికి కెసిఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదన్నారు. గతంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సిఎంగా మోడీ ఉన్న సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ఇటీవల పరేడ్ గ్రౌండ్‌లో బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో మోడీ చెప్పినవి పచ్చి అబద్దాలన్నారు. దేశంలో అనేక ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులు కట్టామని చాలా గొప్పగా చెప్పారన…మరి అవి ఎక్కడ ఉన్నాయో బిజెపి వాళ్ళకే తెలియాలన్నారు. అలాగే కట్టని ఫ్లై ఓవర్ కట్టారని చెప్పడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు.

డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఇడీ

బిజెపి డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఇడీ అని కెటిఆర్ సెటైర్లు వేశారు. మంచి పనులతో ప్రజల మనసులు గెలుచుకోవడం బిజెపికి తెలియదన్నారు రాష్ట్రంలో వరద పరిస్థితి ఉంటే…. ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపారని మండిపడ్డారు. ఉపధి హామి నిధులతో రైతు వేదికలు, కళ్లాలు లాంటి మంచి పనులు చేస్తే అక్రమాలు అంటున్నారని ధ్వజమెత్తారు. నరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రం ఆస్తులను సృష్టిస్తుంటే అభినందించాల్సిన కేంద్రం అందుకు విరుద్దంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా అవినీతి…అక్రమాలు చేయకపోవడమే తాము చేసిన నేరమా? అని కెటిఆర్ ప్రశ్నించారు. నిజంగా కేంద్రానికి సిగ్గుంటే నరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిపై ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన మిగిలిన రాష్ట్రాలకు ఒక రోల్‌మోడల్‌గా చూపించాలన్నారు.

కానీ దురదృష్టవశాత్తు అవినీతిలు…అక్రమాలు జరిగిన రాష్ట్రాలను ఒదిలిపెట్టి మన రాష్ట్రానికే కేంద్ర బృందాలను పంపిడం సిగ్గుచేటన్నారు. శత్రుదేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు రాష్ట్ర అప్పుల విషయంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందరు ప్రధానులు కలిసి రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వం ఒక్కటే 100 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. మోడీ అధ్వానపు పాలనకు ఇంతకన్నా నిదర్శనం మరోటి ఉండదన్నారు. వంద లక్షల కోట్లతో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో…దమ్ముంటే చెప్పాలన్నారు. అలాగే ఆత్మనిర్బర్ కింద ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్లు మునిగిపోయాయని గుర్తు చేస్తూ ప్రకృతి విపత్తుల వల్ల కాళేశ్వరం పంప్ హౌజ్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ చచ్చిపోయింది

రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని కెటిఆర్ అన్నారు. మరో తొమ్మిది, పది నెలల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగలనున్నాయన్నారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో ఏ నాయకుడు ఉంటారో ఎవరికి తెలియదన్నారు. అమోథిలో ఓడిన రాహుల్‌గాంధీ, కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డిలు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారట! అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ముందు ఆయా నియోజకవర్గాల్లో ప్రజల మన్ననలు పొంది గెలిస్తే…అది చాలు వారికి అని అన్నారు. అయితే సిరిసిల్లకు రాహుల్ వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి నేర్చుకోమనండి! అని సలహా ఇచ్చారు. సిరిసిల్లలో ఒక్క రోజు కాదు… రెండురోజులు ఉండి ఇక్కడి పథకాలు, అభివృద్ధి పనులను చూసి నేర్చుకోవాలని కోరుతున్నానని అన్నారు.

కెసిఆర్ ఎవరికీ లొంగరు, బెదరరు

మోడీ ప్రభుత్వంపై ఎదురుతిరుగుతున్న కెసిఆర్‌పై కేంద్రం ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చిన…ఎటువంటి దాడులు (ఇడి, ఐటి) చేసిన సిఎం కెసిఆర్ ఎవరికి లొంగరని కెటిఆర్ అన్నారు. చూడడానికి చాలా బక్కగా ఉన్నప్పటికీ కెసిఆర్ ఎంతో ధృడమైన మనసత్వతం కలవాడన్నారు. అంత ఈజీగా ధైర్యాన్ని కోల్పోయి వ్యక్తి అంతకంటే కాదన్నారు. ఆయన ఏదైనా అనుకును ముందుకు సాగితే…అందులో ఎన్ని అవాంతరాలు ఎదురైనా….మరెన్ని అడ్డంకులు ఎదురైనా బెదరని లక్షణం కెసిఆర్ సొంతమన్నారు. ఇది తెలంగాణ ఉద్యమ సయమంలో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అయినప్పటికీ బిజెపి పెద్దలు కెసిఆర్‌ను గెలకలని చూస్తే…. అది వారికే ప్రమాదమని ఈ సందర్భంగా కెటిఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలోని కొందరు విపక్ష నేతలు కెసిఆర్‌ను దొర అని సంభోదిస్తున్నారని…. ఆయన దొరగా భావించినట్లు అయితే ఎంతమందిని జైల్లో వేశారో చెప్పాలన్నారు.

చట్టాన్ని సవరిస్తేనే పోడు భూముల సమస్యకు పరిష్కారం

కేంద్రం పోడు భూముల చట్టాన్ని సవరణ చేస్తేనే….సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే…వెంటనే పోడు భూముల చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం చట్ట సవరణ చేస్తే వెంటనే పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయిస్తే….వారి చేతితోనే గిరిజనులకు పట్టాలు ఇప్పిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉండటం వల్ల రాష్ట్రంలో సమస్య నెలకొని ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 12లక్షల ఎకరాల మేరకు పోడు భూముల పట్టాల్సి ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు.

గడువు ప్రకారమే ఎన్నికలు

రాష్ట్రంలో గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కెటిఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదన్నారు. వాళ్లు ముందస్తు ఎన్నికల తేదీ ప్రకటిస్తే…. అసెంబ్లీ రద్దు చేస్తామనే సిఎం కెసిఆర్ చెప్పారని వివరణ ఇచ్చారు.119 అసెంబ్లీ స్థానాల్లో బలమైన నాయకులకే టికెట్లు ఇస్తామన్నారు. టిఆర్‌ఎస్ పక్షాన నిర్వహిస్తున్న సర్వేలో వస్తున్న నివేదికల ఆదారంగానే టికెట్లు కేటాయిస్తామన్నారు. వాళ్లే గెలుపు గుర్రాలు అవుతారన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. దీనిపై సిఎం కెసిఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది కెసిఆర్ మాత్రమేనని అన్నారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదని… పరిస్థితులను బట్టి అలా జరుగుతుంటాయన్నారు. ధరణి సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో తమకు ఎటువంటి పంచాయితీ లేదని కెటిఆర్ పేర్కొన్నారు.

ఏమి తినాలో…వద్దో కూడా బిజెపియే చెబుతుందా?

ప్రజలు ఎమి తినాలో…. ఏం తినొద్ధో చెప్పేందుకు బిజెపి నాయకులు ఎవరు? అని కెటిఆర్ ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే దేశంలో ఏకత్వాన్ని రుద్దడం తగదని వ్యాఖ్యానించారు. గతంలో రూపాయి విలువ పడిపోతే దేశం ఆత్మగౌరవం పడిపోతుందని మోడీ అన్నారన్నారు. నాటి మోడీ ప్రస్తుతం మళ్ళీ దేశ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు ప్రజలు గమనిస్తున్నారు.

కేంద్రంతో బాగున్నా ఏమిచ్చారు?

కేంద్రంతో ఏడేళ్లు సఖ్యతతోనే ఉన్నామని కెటిఆర్ అన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రానికి ఏం చేసింది లేదన్నారు. ఇంకా కేంద్రాన్నే రాష్ట్రం ఆదుకుంటోందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే…అక్కడి నుంచి తిరిగి రాష్ట్రానికి వస్తున్నది కేవలం నలభై ఆరు పైసలేనని కెటిఆర్ వివరించారు. ఇది నిరూపించడానికి తాను సిద్దమన్నారు. ఒక వేళ నిరూపించని పక్షంలో తన పదవులకు రాజీనామా చేస్తానని కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News