విన్నిత్సియా (ఉక్రెయిన్): రష్యా క్రూయిజ్ క్షిపణులతో శుక్రవారం ఆగ్నేయ ఉక్రెయిన్ నగరం డ్నిప్రో పై దాడి చేసింది. దాంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్లు మోగినట్లు అధికారులు తెలిపారు.రాజధాని కైవ్‌కు నైరుతి దిశలో ఉన్న విన్నిత్సయాలో రష్యా క్షిపణి దాడిలో కనీసం 23 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడిన మరునాడే డ్నిప్రోపై దాడి జరిగింది.రష్యా సైన్యం ఇప్పుడు ఉక్రెయిన్ తూర్పున ఉన్న డాన్‌బాస్‌పై దృష్టి సారించింది, అయితే ఉక్రెయిన్ భూభాగాన్ని చేజిక్కించుకోవడానికి రష్యా దళాలు ఇతర ప్రాంతాలను కూడా కనికరం లేకుండా దెబ్బతీశాయి.
కాస్పియన్ సముద్రం మీదుగా Tu-95MS వ్యూహాత్మక బాంబర్‌ల నుండి అనేక Kh-101 క్రూయిజ్ క్షిపణులను రాత్రి 10 గంటల సమయంలో డ్నీపర్ నదిపై ఉన్న ప్రధాన నగరమైన డ్నిప్రో పై రష్యా ప్రయోగించింది. అవి ఫ్యాక్టరీని ఢీకొట్టాయి. నాలుగు దూసుకొచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక దళం అడ్డగించినట్లు తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు మండుతున్న పేలుళ్లను, నల్లటి పొగలను చూపించాయి. రష్యా క్షిపణులు ఫ్యాక్టరీ మరియు సమీపంలోని వీధులను తాకాయని, కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని మరియు 15 మంది గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ వాలెంటైన్ రెజ్నిచెంకో తెలిపారు.