Saturday, November 23, 2024

తెలంగాణలో మైనారిటిల సంక్షేమం భేషుగ్గా ఉంది

- Advertisement -
- Advertisement -

మైనారిటిల కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రశంసనీయం
ఇక్కడి గురుకులాలు దేశానికే ఆదర్శం..మేడు అదేబాటలో నడుస్తాం
బీహార్ మంత్రి జమా ఖాన్

Welfare of minorities is good in Telangana

మన తెలంగాణ / హైదరాబాద్ : మైనారిటిలలో నెలకొన్న నిరక్షరాస్యత, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ స్వల్ప కాలంలోనే అన్ని రంగాలలో గణనీయ ప్రగతి సాధించడం అభినందనీయమని అన్నారు. ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చానని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూశానని చెప్పుకొచ్చారు. బంజారాహిల్స్‌లోని మైనారిటి గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యాలయాన్ని శనివారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలతో కలిసి జమా ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో మైనారిటి వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, సొసైటి కార్యదర్శి షఫిఉల్లా లు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటిల సంక్షేమం, ఉన్నతికి 9 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.

తెలంగాణలో లౌకిక ప్రభుత్వం కొనసాగుతున్నదని, ఇక్కడ అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. గంగా జమున తహజీబ్‌కు ఇది నిలువుటద్దమని చెప్పారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటి యువతకు 20 లక్షల చొప్పున ఉచితంగా ఇస్తామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళలకు షాది ముబారక్ పథకం కింద లక్షా 16 రూపాయలు అందజేస్తుండడంతో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గాయని పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని వివరించారు. ఇమామ్, మౌజంలు 10 వేల మందికి 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. మైనారిటిలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా 204 గురుకుల పాఠశాలలను నడుపుతున్నామని, వీటిలో లక్షా 31 వేల మంది బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో విద్య నందించడంతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.

వీటిలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, క్రీడల్లో రాణిస్తున్నారని, అమెరికాలోని నాసా కేంద్రాన్ని కూడా సందర్శించారని తెలిపారు. క్రమశిక్షణతో ఉన్నత ప్రమాణాలు, విలువలతో ముందుకు సాగుతున్న ఈ పాఠశాలలను విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి ప్రశంసలు గుప్పించారని ఎకె ఖాన్, షఫిఉల్లాలు వివరించారు. జమాఖాన్ మాట్లాడుతూ ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న పథకాల గురించి తమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు వివరిస్తానన్నారు. మూడు నెలల తర్వాత తిరిగి ఇక్కడకు వచ్చి గురుకుల పాఠశాలలను సందర్శిస్తానని, వీటిని ఆదర్శంగా తీసుకుని బీహార్‌లో కూడా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసిఉల్లా , హజ్ కమిటి చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News