జూన్ చివరి వారంలో 45 శాతం,
జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం రాష్ట్రంలో నమోదు
దేశంలో దాదాపు 50 శాతం అదనపు వర్షపాతం,
93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. నిన్న ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని ఆమె వివరించారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారని, జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 13 వరకు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదుకాగా, దేశంలో దాదాపు 50 శాతం అదనపు వర్షపాతం నమోదైందని ఆమె పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది. దేశంలో 93.5 మిల్లీమీటర్ల వర్షం కురవగా, కనీసం దేశవ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం కురిసిందని ఐఎండి పేర్కొంది. ఈ వారానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల్లో అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం అంటే 77.3 శాతం మాత్రమే వర్షం కురవగా, ఈశాన్య రాష్ట్రాల్లో 66 శాతం తక్కువ వర్షపాతం కురిసిందని ఐఎండి తెలిపింది.