మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల మృతితో కుటుంబ పెన్షన్ ప్రయోజనం పొందే ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు విడుదల చేశారు. ఉద్యోగికి సంబంధిత పోగైన పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసిన తర్వాత మాత్రమే పొందేలా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉద్యోగానికి అశక్తుడైన,మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ ఫించన్ మంజూరు చేయాలంటే ఉద్యోగి ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం షరతు విధించింది.
ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా సరెండర్ చేయాలో జిఓలో పేర్కొనలేదు. మరణించిన ఉద్యోగుల వారసులు కుటుంబ పెన్షన్ పొందలేక పోతున్నారన్న విషయాన్ని ఉద్యోగ సంఘాలు ట్రెజరీ,ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఉత్వర్వుల్లో మార్గదర్శకాలను, హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ను వెల్లడిస్తూ ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పటికైన సమస్య పరిష్కారానికి తగిన ఉత్తర్వులు ఇవ్వడంపట్ల టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి హర్షం వ్యక్తం చేశారు.