సింగపూర్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు జయకేతనం ఎగుర వేసింది. జపాన్ క్రీడాకారిణి సయేనా కవాకమితో జరిగిన సెమీస్‌లో సింధు అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 21-15, 21-7 తేడాతో జయభేరి మోగించింది. సింధు ధాటికి సయేనా ఎదురు నిలువలేక పోయింది. రెండు సెట్లలో కూడా కనీస పోటీ ఇవ్వడంలో విఫలమైంది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకబడి ఉన్న సయేనా అలవోకగా ఓడించి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో సింధు చైనా షట్లర్ వాంగ్ జి యితో తలపడనుంది. రెండో సెమీస్‌లో వాంగ్ 21-14, 21-14 తేడాతో జపాన్‌కు చెందిన అయా ఒహొరిను ఓడించింది. ఇక వాంగ్‌తో ఇప్పటి వరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. ఫైనల్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో సింధు కనిపిస్తోంది.
Singapore Open: PV Sindhu reached finals