న్యూఢిల్లీ: గుజరాత్ ఘర్షణలకు మోడీని బాధ్యులు చేయాలని సోనియా గాంధీ యత్నించారని ఇందుకు అహ్మద్ పటేల్ కీలక పాత్ర వహించాడనే బిజెపి వాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. మోడీ సారధ్యపు బిజెపి చివరికి గతించిపోయిన వారిని కూడా వదలడం లేదని, వారు ఏ ప్రాతిపదికన అహ్మద్ పటేల్‌పై ఆరోపణలకు దిగుతారని కాంగ్రెస్ శనివారం ప్రశ్నించింది. తీస్తా సేతల్‌వాద్, అహ్మద్ పటేల్‌లను పావులుగా వాడుకుని ప్రధాని మోడీపై సోనియా గాంధీ కుట్ర పన్నారనడం పూర్తి స్థాయి కట్టుకథ, దురుద్ధేశపూరితం అని బిజెపిపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
అప్పటి పాపంతో ఎటువంటి సంబంధం లేదని చాటుకునేందుకు పాపం మోడీ ఎంతో పాటుపడుతున్నారని, ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కుట్ర కోణాన్ని ఇందులో సోనియా, అహ్మద్ పటేల్ పేర్లను ప్రస్తావించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. గుజరాత్ ఎన్నికలకు ముందు తమ నావ మునగకుండా చేసుకునేందుకు ఇటువంటి తాపత్రయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. మోడీ షా ద్వయాల వ్యూహాలలో భాగంగానే పలు కీలుబొమ్మ దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇవ్వడం క్లీన్‌చిట్లకు దిగడం పరిపాటి అయిందన్నారు. ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై మీడియా ద్వారా బిజెపి సొంత తీర్పుల పద్ధతిలో వ్యవహరించడం దారుణం అన్నారు.
Congress Serious on Modi over Ahmed Patel