Saturday, November 23, 2024

సైనాను వెంటాడుతున్న వైఫల్యాలు

- Advertisement -
- Advertisement -

Failures haunt Saina Nehwal

ఇక కెరీర్‌లో మరో టైటిల్ అసాధ్యమేనా?

క్రీడా విభాగం: ప్రపంచ బ్యాడ్మింటన్‌కు లభించిన ఆణిముత్యాల్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం సైనా నెహ్వాల్ ఒకరని చెప్పక తప్పదు. భారత బ్యాడ్మింటన్‌కు కొత్త దిశను చూపించిన ఘనత సైనాకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. మహిళల బ్యాడ్మింటన్‌లో అంతంత మాత్రంగానే ఉన్న భారత్‌కు కొత్త మార్గం చూపించింది సైనానే. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది బ్యాడ్మింటన్‌ను క్రీడాంశంగా ఎంచుకున్నారు. ఇక సైనా కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చారిత్రక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒలింపిక్ పతకాన్ని కూడా సైనా గెలుచుకుంది. ఇక జపాన్, చైనా, కొరియా, స్పెయిన్, డెన్మార్క్, ఇండోనేషియా, చైనీస్‌తైపీ, మలేసియా తదితర దేశాలకు చెందిన ప్రతిభావంతులైన షట్లర్లను వెనక్కి నెట్టి పలు టోర్నమెంట్‌లలో టైటిల్స్ సాధించి సత్తా చాటింది. దీంతోపాటు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను కూడా సాధించింది.

దీంతో మహిళల బ్యాడ్మింటన్‌లో తొలి ర్యాంక్‌ను సాధించిన ఏకైక షట్లర్‌గా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. అయితే ఎప్పుడైతే సింధు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి సైనా వెనుకబడి పోయింది. సింధు వరుస విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. కానీ సైనా ఆట మాత్రం రోజు రోజుకు తీసుకట్టుగా తయారైంది. ఒకప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన సైనా ఆ తర్వాత పేలవమైన ప్రదర్శనతో అభిమానులకు నిరాశకు గురిచేసింది. చాలా ఏళ్లుగా సైనా ఒక్కటంటే ఒక్క టైటిల్‌ను కూడా సాధించలేక పోయింది. టైటిల్ మాట అటుంచితే కనీసం క్వార్టర్ ఫైనల్ దశను కూడా దాటి ముందుకు వెళ్లడం లేదు. దీన్ని బట్టి సైనా ఆట స్థాయికి పడిపోయిందో ఊహించుకోవచ్చు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడే సత్తా ఉన్నప్పటికీ సైనాను వరుస వైఫల్యాలు వీడడం లేదు.

ఆడిన ప్రతి టోర్నీలోనూ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకబడి ఉన్న షట్లర్ల చేతుల్లో ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. ఇలాంటి స్థితిలో సైనా కెరీర్‌లో మరోసారి ఏదైన టైటిల్ సాధిస్తుందా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం సైనా ఆట తీరును గమనిస్తే కెరీర్‌లో మరో టైటిల్‌ను సాధించడం శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఒకప్పుడూ అగ్రశ్రేణి షట్లర్‌గా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆధిపత్యం చెలాయించిన సైనా వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. సైనా కూడా తన ఆటను మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. వరుస ఓటములు ఎదురవుతున్నా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలోనే సైనా అంతర్జాతీయ కెరీర్ ముగిసినా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News