మరింత చురుగ్గా పనిచేయాలి
దక్షిణమధ్య రైల్వే ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రక్షక సిబ్బంది (ఆర్‌పిఫ్) మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మరింత చురుగ్గా విధులు నిర్వహించాలని దక్షిణమధ్య రైల్వే ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్ పేర్కొన్నారు. ఆర్‌పిఎఫ్ సిబ్బంది సామర్థ్య నిర్మాణం, ఆధునీకికరణ మార్పులపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఐజిఎన్‌ఓయు)తో కలిసి సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రతా సిబ్బందికి సంబంధించి 150 మందికి పైగా కానిస్టేబుళ్లు, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాజా రామ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిందని, స్థిరమైన, సమయానుకూలంగా ప్రతిస్పందించే, వినూత్నమైన, సౌకర్యవంతమైన సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. మనం చర్చిస్తున్నట్లు మానవ హక్కుల సర్టిఫికెట్ మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలతో కొత్త కోణాలను జోడిస్తూ రైల్వేలో టిటిఈ/టిసి/ఆర్‌పిఎఫ్/జిఆర్‌పి, ఇతర వాణిజ్య, సాంకేతిక విభాగం సిబ్బందిలో అవగాహన కలిగిస్తే వృత్తి పరమైన వృద్ధి మెరుగవుతుందన్నారు. భారతీయ రైల్వేలో దాదాపు 8,000 స్టేషన్ల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ప్రతి రోజు దాదాపు 2.3 కోట్ల ప్రజలు ప్రతిరోజు ప్రయాణిస్తున్నారని, గణనీయమైన సంఖ్యలో ప్రజలు వివిధ ప్రయోజనాల కోసం రైల్వే స్టేషన్లతో అనుబంధం కలిగి ఉన్నారని ఎప్పటికప్పుడు ఆర్‌పిఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజిఎన్‌ఓయూ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎం.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.