పవార్ నివాసంలో నిర్ణయం ..రేపు నామినేషన్
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరేట్ అల్వాను ఆదివారం ఖరారు చేశారు. మార్గరేట్ అల్వా కాంగ్రెస్ నాయకురాలు, రాజస్థాన్ , మరో మూడు రాష్ట్రాల గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. 80 సంవత్సరాల అల్వా మంగళవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. ఆరోజు 19 వ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేది. ఒక్కరోజు క్రితమే అధికార ఎన్‌డిఎ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీష్ ధన్‌ఖర్‌ను బిజెపి ప్రకటించింది. మరుసటి రోజే విపక్షాల అభ్యర్థి పేరు ప్రకటించారు. ఆగస్టు 6వ తేదీన ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతుంది. ఆదివారం ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇందులో మార్గరేట్ అల్వా పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశామని, రెండు గంటల పాటు తమ భేటీ జరిగిందని విపక్ష అభ్యర్థి పేరును ప్రకటిస్తూ ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. పవార్ నివాసంలోనే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సమావేశం అయ్యారు.
సమిష్టి ఆలోచనా ఫలితంగా అల్వా ఎంపిక జరిగింది. వారు నామినేషన్‌కు సిద్ధం అవుతున్నారని పవార్ చెప్పారు. 17 ప్రతిపక్ష పార్టీల మద్దతుతో అల్వా అభ్యర్థిత్వం ఖరారయింది. ఆప్, టిఎంసిల మద్దతు కూడా ఉంటుందని, ఈ విధంగా మొత్తం 19 ప్రతిపక్ష పార్టీల మద్దతుతో అల్వా పోటి ఉంటుందని వివరించారు. సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్, సిపిఎం నేత ఏచూరి, సిపిఐ నుంచి డి రాజా, శివసేన నుంచి సంజయ్ రౌత్, డిఎంకె నేత టిఆర్‌బాలు, ఎస్‌పి తరఫున రామ్ గోపాల్ యాదవ్ , టిఆర్‌ఎస్ నుంచి కె కేశవరావు హాజరయ్యారు. టిఎంసి, ఆప్ మద్దతు కూడా తమకు ఉంటుందని పవార్ తెలిపారు. మమతతో, అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడేందుకు తాను యత్నిస్తున్నానని పవార్ వెల్లడించారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో ఎటువంటి విభేదాలకు తావులేదన్నారు. జెఎంఎం, ఆర్జేడీ, ఐఎంయు, కేరళ కాంగ్రెస్ కూడా కలిసివస్తాయని తెలిపారు.
సవినయంగా ఆమోదిస్తున్నా : అల్వా
విపక్షాలు తనను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని తాను సవినయంగా అంగీకరిస్తున్నానని మార్గరేట్ అల్వా తెలిపారు. ఉమ్మడిగా అంతా కలిసి తన పేరు ప్రతిపాదించారని, ఈ విధంగా తనపై నమ్మకం ఉంచినందుకు అందరు నేతలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఓ ప్రకటన వెలువరించారు. కర్నాటకలోని మంగళూరులో 1942లో జన్మించిన అల్వా కాంగ్రెస్‌లో పలు కీలక పదవులు పోషించారు. ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పుడు సోనియా, రాహుల్ వంటి నేతలకు కీలక రాజకీయ అంశాలలో సహకరించారు. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గతంలో గవర్నర్‌గా వ్యవహరించారు. 1974లో తొలిసారిగా రాజ్యసభకు ఎంపిక అయ్యారు. బెంగళూరులో లా డిగ్రీ చేశారు. చట్టసభలలో సౌమ్యమైన రీతిలో వ్యవహరించే వక్తగా పేరొందారు. 1964లో ఆమె నిరజంన్ థామస్‌ను వివాహమాడారు. వారికి ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.