సింధుకు టైటిల్!
సింగపూర్ ఓపెన్ ఫైనల్లో వాంగ్ జి యిపై గెలుపు
సింగపూర్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు ఎట్టకేలకు ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్ సొంతం చేసుకుంది. సింగపూర్ ఓపెన్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-9, 11-21, 21-15తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి(చైనా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్లోఆడిన ఏకైక మ్యాచ్‌లో వాంగ్ జియిని ఓడించిన సింధు.. తాజా మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. తొలి గేమ్‌లో అద్భుత ప్రదర్శనతో అలవోకగా గెలిచిన సింధుకు రెండో గేమ్‌లో ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. వాంగ్ జి యి ఆధిపత్యం చెలాయించడంతో సింధు షటిల్‌ను సరిగ్గా కంట్రోల్ చేయలేక పోయింది.
వరుసగా తప్పిదాలతో గేమ్ కోల్పోయింది. ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన వాంగ్.. 3-0, 6-1, 11-3తో ఆధిక్యాన్ని పెంచుకుంటూ సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఫోర్ హ్యాండ్ షాట్‌తో 21-11తో వాంగ్ రెండో గేమ్‌ను కైవసం చేసుకుంది. మూడో గేమ్ అయిన డిసైడర్ గేమ్‌లో ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 4-4 సమంగా దూసుకెల్లారు. ఈ పరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సాధించిన సింధు 8-5తో లీడ్‌లో నిలిచింది. అంతేకాకుండా వాంగ్‌పై తీవ్ర ఒత్తిడి పెచింది సింధు. దీంతో వాంగ్ వరుస తప్పిదాలు చేసింది. అనంతరం 12-10తో పుంజుకున్నా.. సింధు ఆధిక్యం తగ్గకుండా చెలరేగింది. చివరకు తనదైన స్మాష్‌లతో 21-15తో గేమ్‌తో పాటు టైటిల్‌ను పొంతం చేసుకుంది సింధు. కాగా. ఈ ఏడాది సింధు గెలిచిన మూడో టైటిల్ ఇది. ఈ టోర్నీకి ముందు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్స్, స్విస్ ఓపెన్ బిడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను సింధు తన ఖాతాలో వేసుకుంది.
PV Sindhu won Singapore Open Title