తిరువనంతపురం : కేరళ లోని కన్నూర్ జిల్లా లో మంకీపాక్స్ రెండో కేసు వెలుగు చూసినట్టు సోమవారం ఆ రాష్ట్ర వైద్యశాఖ ధ్రువీకరించింది. కన్నూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, అతనితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి సారించామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ వ్యక్తి జులై 13 న దుబాయ్ నుంచి బయలుదేరి కర్ణాటక లోని మంగళూరు విమానాశ్రయంలో దిగారు. తర్వాత లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలు ఎన్‌ఐవీ పుణెకు పంపగా తాజాగా పాజిటివ్‌గా తేలిందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల యూఎఇ నుంచి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తిలో మొదటిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో దీని బారిన పడ్డారు. ఆ వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. కేరళ వైద్య సిబ్బందికి సహకరించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది.