ఉభయ సభల్లో ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి
టిఆర్ఎస్ ఎంపిల నిరసన గందరగోళం
నెలకొనడంతో సభలు వాయిదా జవాబు
చెప్పకుండా మోడీ ప్రభుత్వం పారిపోయింది: ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న ద్ర వ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్రం ఘోరం గా వి ఫలమైందని పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దీని కారణం గా దేశ ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మా రుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్ర భుత్వ అసమర్ధత కారణంగా దేశంలో నిత్యవసర వస్తువుల ధరల కు రెక్కలు వచ్చాయని ఆరోపించారు. ఇందుకు నిరసనగా మంగళవారం రాజ్యసభ, లోక్‌సభలో టిఆర్ఎస్ ఎంపీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లో సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టిఆర్ఎస్ ఎంపీలతో పాటు విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు కూడా ప్లకార్డులు చేతబట్టారు. స్పీకర్ ఛైర్‌ను చుట్టుముట్టారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులకు అనుమతి లేదని చెప్పారు. అయినప్పటికీ టిఆర్ఎస్ ఎంపిలు వెనక్క తగ్గలేదు. విపక్ష సభ్యులతో తమ ఆందోళనను మరింత ఉధృ-తం చేశారు. దీంతో సభలో చాలా సేపు గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక రాజ్యసభలో సైతం ఇదే తరహా గందరగోళం నెలకొంది. ఆహార పదార్థాలపై జిఎస్టి విధింపు, ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉభయ సభల్లోనూ సభ సక్రమంగా జరగకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా హరించుకపోయింది. దీంతో లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా వాయిదాపడింది. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ..పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని పేర్కొంటూ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
గాంధీ విగ్రహం ముందు వారు ప్లకార్డులు ప్రదర్శించి, మోడీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, లోక్‌సభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడు నామానాగేశ్వరరావుతో పాటు ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దివకొండ దామోదర్‌రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. ధరల పెరుగుదల అంశంపై ఉభయ సభల్లో తాము లేవనెత్తితో సమాధానంగా చెప్పకుండా మోడీ ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ప్రజల సమస్యలను చర్చించకుండా సభలను పదేపదే వాయిదా పడుతుండడం విచారకరమన్నారు. మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాల గొంతు నొక్కుతోందన్న ఆరోపించారు. సభల్లో విపక్షాలకు చర్చించే అవకాశమివ్వడం లేదని మండిపడ్డారు.
అనంతరం మీడియాతో ఎంపి వెంకటేశ్‌నేతకాని మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల విలువ, గౌరవంలేదని విమర్శించారు. ఆయన నియంత పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ప్రతిపక్షాల సమస్యలు విని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ చెల్లించింది రూ.3,65,797 కోట్లు అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ.1,96,448 కోట్లు మాత్రమే అని వివరించారు. తెలంగాణ రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ మోడీ ప్రభుత్వం వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ఘనత మోడేదేనని మండి పడ్డారు. శీతాకాల సమావేశాల్లోనైనా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై కూలంకషంగా చర్చ జరుగుతుందని ఆశించామన్నారు. కానీ మోడీ ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్‌లపై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మరో ఎంపి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదర్శ గ్రామాల పంచాయతీల్లో కేంద్రం ఎంపిక చేసిన 21లో 19 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయని అన్నారు. తెలంగాణ ఎంతగా అభివృద్ధి అయిందో ఇదే నిదర్శనమని చెప్పారు. కయ్యానికి పోకుండా.. తెలంగాణకు సాయం చేయండని పేర్కొన్నారు.