దళిత మంత్రి రాజీనామా ..మరో మంత్రి ఢిల్లీకి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ మంత్రిమండలిలో అసంతృప్తి రగులుకుంది. కేబినెట్ నుంచి దళిత మంత్రి దినేష్ ఖాతిక్ రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడంతో నిర్లక్షం చేస్తున్నారని పేర్కొంటూ ఆయన తమ రాజీనామా లేఖను హోం మంత్రి అమిత్ షాకు పంపించారు. ఇక మరో మంత్రి జితిన్ ప్రసాద ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి ఆయన తమ గోడును బిజెపి నాయకత్వానికి తెలియచేసుకుంటున్నారు. బిజెపి ప్రభుత్వాలలో ఎక్కడా కానరాని విధంగా అసాధారణ రీతిలో అసమ్మతి బహిరంగం కావడం తొలిసారి అయింది.ముఖ్యమంత్రిని లక్షంగా చేసుకుని జలవనరుల శాఖ మంత్రి అయిన ఖాతిక్ భారీస్థాయిలో విరుచుకుపడ్డారు. వందరోజులుగా తనకు ఎటువంటి పని అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తనను మానసికంగా గాయపర్చారని, కేబినెట్‌లో ఉండటం ఇష్టం లేక వైదొలుగుతున్నట్లు తెలిపారు. పేరుకు మంత్రిగా ఉన్నానని అయితే ఎటువంటి అధికారం లేదని తెలిపారు. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి బిజెపికి వచ్చిన సీనియర్ నేత జితిన్ ప్రసాద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే తన ఒఎస్‌డిని సస్పెండ్ చేశారని అన్నారు. ప్రసాద కీలకమైన ప్రజా పనుల విభాగం (పిడబ్లుడి ) మంత్రిగా ఉన్నారు.మంత్రిపై కూడా అవినీతి సంబంధిత విషయాలపై ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనిపై తన వద్దకు వచ్చి మాట్లాడాలని జితిన్ ప్రసాదను సిఎం ఆదేశించినట్లు , ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి తన గోడు విన్పించుకుంటున్నట్లు వెల్లడైంది.