జిఎస్‌టి విధింపుపై విపక్షాల
తీవ్రస్థాయి నిరసన ఉభయ
సభల్లో పాలు, పెరుగు ప్యాకెట్లు
ప్రదర్శిస్తూ ఆందోళన
టిఆర్‌ఎస్ నిరసనలతో
దద్దరిల్లిన పార్లమెంట్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్రం తీరుపై ఉభయ సభల్లో ఎంపిలు తీవ్ర స్థాయి లో ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు. పాలు, పెరుగు ప్యాకెట్లతో పోడియం వద్దకు దూసుకెళ్లి ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేశా యి. జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో బుధవారం సభలో ఎలాంటి చర్చ జరగకుండానే గురవారం నాటికి వాయిదా పడ్డాయి. దేశంలో అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యవసర వస్తువల ధరలు, కొత్త వస్తువులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకరావడం, అగ్నిపథ్ పథకం వంటి అంశాలపై చర్చ జరగాలని ఎంపిలు కేంద్రాన్ని నిలదీశారు. ఇందుకు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా కలవడంతో సభలో ఎప్పటి మాదిరిగానే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఉదయం భేటీ అయిన నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడగా.. ఆ తర్వాత సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
కార్యకలాపాలు సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రోజు కూడా పార్లమెంట్ ను కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలపై కేంద్రం మోపిన భారంపై టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, జిఎస్‌టిని పెంచి సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ బుధవారం కూడా పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తన నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మోడీ నేతృత్వంలో సామాన్య ప్రజలు జీవించ లేని దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దేశ వనరులను దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వం …సామాన్యులకు మాత్రం చుక్కులు చూపిస్తోందన్నారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు చెప్పింది వినే పరిస్థితులో కూడా మోడీ లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మోడీ ఒక నియంతలా వ్యవహరిస్తూ….దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులుకేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్. సురేష్ రెడ్డి, మలోత్ కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని , పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస రెడ్డి, దివకొండ దామోదర రావు, బండి పార్థసారధిరెడ్డి, బిబి పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉన్నారు.