Tuesday, December 24, 2024

ఆదివాసీ రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక రాష్ట్రపతులలో పిన్న వయస్కురాలుగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేగాక స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన మొదటి రాష్ట్రపతిగా ఆమె మరో గొప్పతనాన్ని సొంతం చేసుకొన్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, ఎస్‌సిల ప్రతినిధులు యీ పదవిని అలంకరించారుగాని ఆదివాసీ ప్రతినిధి రాష్ట్రపతి కావడం, అందులోనూ ఆ వర్గ మహిళ కావడం యిదే తొలిసారి. కింది వర్గాలను, నిమ్నజాతులను ద్వేషించి అణగదొక్కడంలో అసమాన చరిత్ర మూటగట్టుకొన్న హిందుత్వశక్తుల బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా ఎస్‌సిని, ఎస్‌టిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడం విశేషమే.

TDP supports Murmu

అలాగని ఆ రెండు వర్గాల ప్రజలు ఎన్‌డిఎ పాలనలో సుఖంగా జీవిస్తున్నారని గాని, వారికి అపూర్వమైన రక్షణ లభిస్తున్నదని గాని అనుకొంటే అది పొరపాటే అవుతుంది. ఈ రెండు వర్గాల ప్రతినిధులను ఎన్‌డిఎ వరుసగా రాష్ట్రపతులను చేయడం కేవలం ప్రస్తావనప్రాయమే, చెప్పుకోడానికి వుపయోగపడేది మాత్రమే. ఏ సమాజమైనా నాగరకమవుతున్న కొద్దీ మూలాలకు దూరమవుతుంటుంది. ఆమేరకు మూలవాసుల సంఖ్య తగ్గిపోతుంటుంది. అలా మిగిలిన వారే అడవులను అంటిపెట్టుకొని ప్రకృతిని కాపాడుతూ దాని వొడిలో మనుగడ సాగిస్తూ వుంటారు. ఈ తెగలు మన నాగరక సమాజాల్లో మాదిరి కుల, మత వైషమ్యాలు లేకుండా సంస్కృతుల వైభవంతో మనుగడ సాగిస్తున్నాయి. గోండ్లు, సంతాలులు, కోయలు వంటి తెగలతో గల ఆదివాసీలు దేశ జనాభాలో 8.2 శాతంగా వున్నారు. రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ ప్రాంతాల రక్షణ బాధ్యత రాష్ట్రపతిపై వుంటుంది. అందుచేత ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము వైపు ఆదివాసీలు ఆశగా యెదురు చూస్తున్నారు. ఒడిశాలో మంత్రిగా పని చేసిన ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా వున్నారు. జార్ఖండ్ గవర్నర్‌గా ముర్ము ఛోటా నాగపూర్, సంతాల్ పరగణాల కౌలు చట్టాల సవరణను అడ్డుకొన్నారనే పేరు సంపాదించుకొన్నారు. కాని ఎస్‌టి కమిషన్‌ను వేయించలేకపోయారనే విమర్శ వున్నది. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాల రాష్ట్రపతులు తమ జనాభాకు మేలు చేయడంగాని, వారి బాధలు తొలగించడంగాని ఊహకందని పరిణామం.

ప్రధానిని గాని ఆయన మంత్రి వర్గాన్ని గాని కాదని రాష్ట్రపతులు చేయగలిగేది వుండదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నీడలో రాష్ర్టపతులు చేయగలిగేదేమిటో రామ్‌నాథ్ కోవింద్ విషయంలో చూసిందే. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఎస్‌సిలపై జరిగిన అఘాయిత్యాల సందర్భంగా ఆయన మౌనం విదితమే. దేశంలో గల బొగ్గు గనులన్నిటినీ తవ్వించి తన ప్రియాతి ప్రియమైన అదానీ, అంబానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదార్ల ఆశలు నెరవేర్చాలని ప్రధాని మోడీ కంకణం కట్టుకొన్నారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని కోట్లాది మంది గిరిజనుల కాళ్ళకింది భూమి కదిలిస్తేగాని బొగ్గును తవ్వి తీయడం సాధ్యం కాదు. పదేళ్లలో దేశంలో బొగ్గు తవ్వకాన్ని రెండింతలు చేయాలని, యేడాదికి బిలియన్ టన్నుల తవ్వకం చేపట్టాలని ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నది. ఇందుకోసం సువిశాలమయిన ఆదివాసీ ప్రాంతాలను వారి అనుమతి, ఆమోదాలు తీసుకోకుండానే వేలం ద్వారా అదానీ, వేదాంత, జిందాల్ వంటి కంపెనీలకు కట్టబెట్టింది. గూడు, కూడు లేకుండా నిర్వాసితులమై అంతరించిపోతామనే భయంతో గొంతెత్తి ప్రశ్నిస్తున్న ఆదివాసీలపై దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నది.

వారు అనివార్యంగా వామపక్ష తీవ్రవాదాన్ని ఆశ్రయించడంతో ప్రభుత్వ అణచివేతకు గురి అవుతున్నారు, అరెస్టులు సాగిపోతున్నాయి. హత్యలు, ఎన్‌కౌంటర్ వూచకోతలూ జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలు వంటి హక్కులను ఆదివాసీలు కోల్పోతున్నారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల కర్బన కాలుష్యం చేరి వాతావరణంలో వోజోన్ పొరకు ముప్పు పెరిగి ప్రళయం ముంచుకొస్తుంది. అందుచేత బొగ్గు తవ్వకాన్ని పర్యావరణ పరిరక్షకులు తీవ్రంగా వ్యతిరేకస్తున్నారు. బొగ్గుపై వ్యామోహన్ని వదులుకోవాలని ఐక్యరాజ్యసమితి కూడా పిలుపిచ్చింది. మోడీ ప్రభుత్వానికి అది బొత్తిగా పట్టడం లేదు. ప్రభుత్వం, బలమైన ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ప్రయోగిస్తున్న హింసను తట్టుకోలేక, అడవిని వీడిపోలేక, కంపెనీల కట్టుబానిసలుగా చాలీచాలని బతుకులు బతకలేక దిక్కుతోచక దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న ఆదివాసీలను ద్రౌపది ముర్ము ఆదుకోగలరా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News