Friday, January 10, 2025

చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?

- Advertisement -
- Advertisement -

China and India

‘నవంబరులో జీ జిన్‌పింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్ధరణ వెనుక ‘అసాధారణ అత్యవసరం ముందుకు నెట్టి ఉండవచ్చు’ అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది?గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా (దక్షిణాసియా దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్ధి పొందింది.

మిగతా వాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్ధపడుతున్నామా? గతం కంటే నరేంద్ర మోడీ హయాంలో దేశపరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా! కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధిరేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మన వెంటపడతాయని భ్రమించకూడదు.

కఠినమైన కరోనా లాక్‌డౌన్ కారణంగా తొలి అంచనా 5.5 శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం 3 4 శాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్ ఎక్సేంజస్, క్లియరింగ్ (హెచ్‌కెఇఎక్స్) సిఇఒ నికోలస్ అగుజిన్ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని, 2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55 శాతం వరకు లోహాలను చైనాలో శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.

పశ్చిమ దేశాలు మానవ హక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరోవైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5 శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3 శాతం తగ్గినట్లు చైనా కస్టవ్‌‌సు శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి 6 నెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు.

గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా, చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్ధతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు. ‘ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు’ అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైవ్‌‌సు ఆఫ్ ఇండియా ప్రచురించింది.గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా? 2014 15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లు ఉండగా, 2021 22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది.

వర్తమాన సంవత్సర తీరుతెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్ధి చేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక. కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ధి పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ధి, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009 10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్ డాలర్లుండగా, 2018 19 నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి 5 లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్ర మోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనిక దేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపి లో చేరేందుకు మనం వెనుకడుగువేశాము.

మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య (ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మన వల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.

ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్ధంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే. ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమ లాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.

వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్ డాలర్లకు లేదా జిడిపిలో 7.3 శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన 3 నెలల్లో గతేడాది లోటు 31.4 బి.డాలర్లు కాగా, ఈ ఏడాది 70.8కి పెరిగింది. మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా అన్నా ఆ బ్రాండ్ పేరును పక్కనపెట్టి తాజాగా ఆత్మనిర్భర్ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లుపట్టుకొని అమెరికా మిలిటరీ అఫ్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశా ము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్ధానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం.

విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం. 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35 శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది. చైనా, పాకిస్తాన్ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News