Wednesday, January 22, 2025

ఇదో పరీక్షే!

- Advertisement -
- Advertisement -

వరద ముప్పు తీవ్రత పెరిగే ప్రమాదం

రానున్న 3రోజులు అప్రమత్తంగా
ఉండాలి గోదావరి పరీవాహక
ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో
వరదలను ఎదుర్కోవాలి చెరువులు,
కుంటల దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
వాతావరణ శాఖ హెచ్చరికల
నేపథ్యంలో అధికారులు, మంత్రులు,
ప్రజా ప్రతినిధులతో సిఎం సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో శనివారం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. అందుబాటులో ఉ న్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై చర్చించారు. ఏయే జిల్లాల్లో ఎంత మేర వర్షపాతం నమోదయ్యింది, నదీపరివాహక ప్రాంతాల్లో ఎగువన కురిసిన వర్షాల కారణంగా ఏ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది, తదితర అం శాల గురించి అధికారులు, మంత్రులు సిఎం సమీక్షించారు. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గోదావరి తీర ప్రాంతంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి పరిస్థితులపై సిఎం కెసిఆర్ ఆరా తీశారు.

త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు

ప్రస్తుతం కురిసే వర్షాలకు గతం కంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని, దీంతో గోదావరి పరీవాహక జిల్లాలకు చెందిన చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. గోదావరి నది తన జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతోందని, ఉప నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని ఈ నేపథ్యంలో అధికారులంతా సమన్వయంతో ముందుకుసాగాలని ఆయన సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, మొన్నటి వరదల కంటే ప్రస్తుతం ఎక్కువగా వరదలు సంభవించే ప్రమాదం ఉందని సిఎం కెసిఆర్ అధికారులను హెచ్చరించారు. ప్రస్తుతం కురిసే వానలతో ఎల్లుండి వరకు గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

పోలీసు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా…

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటిలాగే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. కిందిస్థాయి పోలీస్‌స్టేషన్ల వరకు ఎస్‌ఐ, సిఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డిజిపిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రజేంటేషన్ ద్వారా ప్రాజెక్టుల పరిస్థితుల గురించి….

నగరంలో వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితి గురించి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎలా వస్తున్నాయన్న విషయాలను సిఎం కెసిఆర్‌కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకు మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సిఎంకు వివరించారు.

కొత్త టెక్నాలజీతో వరదముప్పు….

వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్‌కుమార్ వివరించారు. వాతావరణ శాఖ వానలను అంచనా వేస్తుందని, కానీ, తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతుందని, ఈ కొత్త టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్‌కుమార్ తెలిపారు.

వరద సమయాల్లో విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంది ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాల్వల పరిస్థితి ఏమిటీ? అన్నీ క్లియర్ గానే ఉన్నాయా? జల్‌పల్లి, ఫీర్జాదీగూడ వంటి చెరువుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా వరద సమయాల్లో విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంది ? ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందా? ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటీ? అని మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత, లక్ష్మీబ్యారేజి, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బ్యారేజీల నుంచి వరద ఎలా వస్తుందన్న విషయాల గురించి ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నిస్తూ, సమగ్రంగా సమాధానాలు అడిగి తెలుసుకున్నారు.

మొన్నటి వరదల్లో అన్ని శాఖల సేవలు భేష్

మొన్నటి వరదల సందర్భంగా వైద్యం, విద్యుత్, పంచాయితీ రాజ్, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయ కార్యక్రమాలు నిర్వహించారని సిఎం అభినందించారు. భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును హెల్త్ డైరెక్టర్‌ను వైద్యాధికారులను, సిఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నతీరు అభినందనీయమని సిఎం కొనియాడారు. అదే స్ఫూర్తి తో అన్ని శాఖలు కూడా రేపటి విపత్తునుంచి ప్రజలను ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవాలని సిఎం సూచించారు.

డెంగ్యూ లాంటి వ్యాధులను ముందస్తుగా అరికట్టాలి

డెంగ్యూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి సైకిల్ గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే అరికట్టాలని వైద్యాధికారులను సిఎం ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈఓలు, ఎంపిడిఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ రెండు రోజులు అలసత్వంగా ఉండవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.

దెబ్బ తిన్న రోడ్లను పునరుద్ధరిస్తున్నాం

హైదరాబాద్ పరిధిలో రోడ్ల పరిస్థితిపై జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్‌ను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న నేషనల్ హైవే, ఆర్ అండ్ బి రోడ్లను పునరుద్ధరిస్తున్నామని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎంకు వివరించారు. ఈ వరదల ద్వారా వచ్చిన అనుభవంతో సబ్ స్టేషన్లను వరదల్లో మునగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, మొత్తం 11 కెవి సబ్ స్టేషన్లు ఏ విధంగా నియంత్రణలో ఉన్నాయన్న సమాచారాన్ని సేకరించాలని సిఎం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సిఎం కెసిఆర్ ఫోన్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి సిఎం కెసిఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎం కెసిఆర్ మంత్రిని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కెసిఆర్ సూచించారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని మంత్రిని సిఎం ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని,హెలీప్యాడ్‌లను సిద్ధంగా ఉంచాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News