గ్రహబలం, తపోబలం, యాగబలం, మనోబలం, అధికారబలం వంటివన్నీ సామాజిక భావనలు. విశ్వాసాలపై ఆధారపడ్డ సంప్రదాయ భావనలు తప్ప వైజ్ఞానిక భావనలు కావు. కొలవగలిగే బలాలు కూడా కావు. ‘లోక కల్యాణార్థం’ అంటూ తమ చేతకాని తనాన్ని కప్పిపచ్చుకోవడానికి యజ్ఞాలు, యాగాలు చేయడం జరుగుతూ వుంది. అవి చేయడం వల్ల సమాజానికి మేలు జరిగిందని కథలు అల్లి చెప్పుకోవడమేగాని, వాస్తవంగా రుజువు లేవు. చండీయాగం ఎలా చెయ్యాలో తెలుసుకోవాలని పండితులనబడే వాళ్లను అడగండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెపుతారు. పోనీ గుగూల్‌లో సెర్చ్ చేసి చూడండి. బోలెడు లింకులు వస్తాయి. అందులో దేనిలోనూ చండీయాగం చేస్తే ఫలితం ఏ మొస్తుందన్న దానికి శాస్త్రీయ వివరణ వుండదు. కేవలం తలా తోకా లేని వాక్యాలు కనిపిస్తాయి. ఒక దానికి మరొక దానికీ పొంతన వుండదు. (చండీయాగం ఒక ఉదాహరణ మాత్రమే)
చండీమాతే ఆదిశక్తీ అని అంటారు. ఆమే పరాశక్తీ అని కూడా అంటారు. ఆదిశక్తి (మొదటిశక్తి) పరాశక్తి (చివరి శక్తి) రెండూ ఆమే అని అంటారు. ఆమే లేని చోటు వుండనే వుండదంటారు. బ్రహ్మ, శివుడూ ఆమెను పూజిస్తారని చెపుతారు. బ్రహ్మ సృష్టికర్త అయినప్పుడు ఆయన మళ్లీ ఆమె అనుగ్రహం కోసం పాకులాడడం దేనికీ? ఆది పరాశక్తిని సంతృప్తి పరచడానికి రుషులు చండీ యాగాన్ని రూపొందించారని చెపుతారు.
ఆమెను సంతుష్టి పరచడానికి ఇలాంటి క్రతువులు చేస్తూనే వుండాలని చెపుతారు. ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. ఆదిశక్తి, పరాశక్తీ ఆమేయై సకల చరాచర జగత్తులో వుండగా, ఆమెకు ఏమి తక్కువైందని మనం ఆమెను సంతుష్టి పరచాలో చెప్పరు. అంతటి మహాశక్తి శాలికి కానుకలు లంచంగా ఎందుకివ్వాలో చెప్పరు. యాగాలు చేసి ఆమె అనుగ్రహం పొందితే జరిగేదేమిటో స్పష్టం గా చెప్పరు. ఆ మాటకొస్తే ఏ దేవుడు/ దేవతకైనా మొక్కులు, కానుకలు, నైవేద్యాలు, బలులు ఎందుకూ? వారి దయాదాక్షిణ్యాలతో మనం ఊపిరి పీలుస్తున్నామని చెపుతున్నారు కదా? అలాంటప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్‌లు ఎందుకు? సమాన స్థాయి గల వారి మధ్య ఇలాంటివి వుంటాయి. ఆ రకంగా దేవుడు/ దేవత మనిషి సమానులైనట్లే కదా?
నిజ జీవితంలో విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలకు కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, ఆందోళనలు, అనారోగ్యాలు ఎన్నో వుంటాయి. అంతేకాకుండా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశా లు ఎన్నో వుంటాయి. తప్పితే వారికి మాయలు, మంత్రాలతో పని లేదు. అవి కేవలం మూఢ విశ్వాసాలు గల వారికి మాత్రమే వుంటాయి. ఇంట్లో శుభ కార్యానికి ఒకడు మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే, మరొకడికి ఇల్లు గడవడానికి నెలకు మూడు వేల కూడా వుండివు. ప్రపంచంలో ఎనభై శాతం వనరులు ఒకటి రెండు శాతం ధనవంతుల చేతిలో వుంటే మిగిలిన ఇరవై శాతం వనరులు 98 శాతం ప్రజలకు సరిపోవడం లేదు కదా? మరి తల్లి అయిన ఆదిపరాశక్తికి ఈ విషయాలు తెలియక పోవడమేమిటి? తెలిసినా, నిమ్మకు నీరెత్తినట్టు వుండడమేమిటి? కోట్లలో వున్న తన బిడ్డలనందరినీ సమానంగా చూడాల్సిన తల్లి, కొంత మందిని మాత్రమే ప్రేమగా చూస్తూ మిగతా వారిని అలగా జనం కింద వదిలి వేయడం దేనికీ? ఒక తల్లికి అది న్యాయం కాదు గదా? న్యాయం చేయలేనప్పుడు ఆమె తల్లి ఎలా అవుతుంది? అంటే ఇది కొందరు కావాలని ప్రచారం చేసిన భావనే తప్ప, యదార్థం కాదని తేలిపోయింది కదా? తల్లి/ శక్తి/ మాత లాంటివి భ్రమలే తప్ప వాస్తవం కాదు.
అలాంటప్పుడు ఆ భ్రమకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఎందుకు? లక్షలు ఖర్చు పెట్టి యాగాలు చేయడమెందుకు? ‘లోక కల్యాణార్థం’ చండీ యాగమని గొప్పలు పోవడమెందుకు? ఇదే కాదు, ఇతర యాగాలు, పూజలు, అర్చనలు, ప్రేయర్లు, నమాజులు ఏవి చేసినా, వాటి వల్ల సమాజ ప్రయోజనం ఏమీ లేనప్పుడు వాటిని ‘లోక కల్యాణార్థం’ జరపడం వృథా! ఆ ఖర్చుతో ఏ కొద్ది మంది ఆకలి తీర్చ గలిగినా మానవాళికి మేలు జరిగినట్లే పూజలతో, యజ్ఞయాగాలతో ఏ శక్తీ వుత్పత్తి కాదు. వాటి వల్ల జనానికి ఏ లాభమూ చేకూరదు. సమాజంలో కాలుష్యం పెరగడం తప్ప మానవ వినాశనం జరగడం తప్ప.
లోక కల్యానార్థం యాగాలు చేస్తున్నామనే వారు, ప్రయోగాత్మకంగా వాటి వల్ల జరిగే మేలు చూపించకుండా విశ్వాసాల మీద జనం ఎల్లప్పుడూ బతకాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మతం జనాన్ని బలహీనులుగా చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ! ఒక రకంగా తమ అసమర్థతకు, చేతకాని తనానికి ‘యాగం’ అని చెప్పుకుంటారేమో! దేశంలో అసంఖ్యాకంగా పెరిగిపోయిన, బాబాలు, స్వాములు, పీఠాధిపతులు, ప్రవచనకారులు కూడా ఈ లోక కల్యాణానికి తమ కృషిని జోడిస్తున్నారు.
సామాన్యుల్ని మానసిక బలహీనులుగా తయారు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. దేవుడున్నాడన్న అంధ విశ్వాసం లో భక్తి పేరుతో అమాయకుల నుండి లెక్క లేనంత డబ్బు, బంగారం, వెండి ఆభరణాల రూపంలో లాగడం పెద్ద మోసం. వివిధ దేశాల్లోని మన ఎన్నారై అంధ విశ్వాసకుల నుండి కూడా లెక్కకు మించిన సొమ్ము లాగి లేని దేవుడి వైభవాన్ని నిలబెడుతున్నారు. దేవుడనే వాడు వుంటే ఆశ్రమాలలో బాబాలు, స్వాములు స్త్రీలపై అత్యాచారాలు చేసి ఎందుకు చంపుతున్నారు? వీళ్లంతా రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఎంబాసిడర్లుగా, అధికారంలో వున్న వారికి బినామీలుగా ఎందుకు మారుతున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకు కుడి భుజాలెందుకు అవుతున్నారు? ఎవరైనా ఎదిరిస్తే వారిని హతమార్చి ఆనవాళ్లు కూడా లేకుండా ఎందుకు భూస్థాపితం చేస్తున్నారూ? పాలకుల బ్లాక్ మనీ వైట్‌గా మార్చేందుకు ఎందుకు తాపత్రయ పడుతున్నారు? ఇదంతా ‘లోక కల్యాణం’ కోసమేనా? మతమే ఓ మత్తు మందైతే, అది చాలదన్నట్టు తమ దగ్గరికి వచ్చే అమాయకులకు భంగు, గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ అలవాటు చేసి, వారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నట్లూ? పైకి మాత్రం భక్తి, ఆధ్యాత్మికత, దైవ భావ న, సమర్పణ లాంటి మాటలు చెపుతూ, దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప చేస్తున్నామని అనుగ్రహ భాషణలిస్తారా?
వాస్తవంగా ఈ విశాల విశ్వంలో ఏయే శక్తులు (బలాలు) వున్నాయో చూద్దాం. గతంలో ఏది జరిగినా, భవిష్యత్తులో ఏది జరగాలన్నా అందుకు నాలుగు రకాల బలాలే (శక్తులే) కారణం అవుతాయి. 1. స్ట్రాంగ్ నూక్లియర్ ఫోర్సెస్ 2. వీక్ నూక్లియర్ ఫోర్సెస్ 3. గ్రావిటేషనల్ ఫోర్సెస్ 4. ఎలక్ట్రో మేగ్నటిక్ ఫోర్సెస్. ఇందులో మొదటి రెండు బలాలు పరమాణు కేంద్రకంలో తప్ప మన దైనందిన జీవితంలో బయట కనిపించవు. వీటిని బలమైన/ బలహీనమైన కేంద్రక బలాలు అని అనుకోవచ్చు. ఇక చివరి రెండు గ్రావిటేషనల్/ ఎలక్ట్రోమేగ్నటిక్ ఫోర్సెన్‌ని గురుత్వాకర్షణ / విద్యుదయస్కాంత బలాలు అని అనుకుందాం. మన రోజువారీ కార్యకలాపాలకు, సంఘటనలకు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా ఈ చివరి రెండు బలాలే కారణం అవుతాయి. ఇంతకు మించి ఇతర బలాలూ, శక్తులూ వున్నాయని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది.
భారత ప్రధాని 2020 జనవరి 3న ఉదయం 11:12 గంటలకు ట్విట్టర్‌లో ఇలా ఒక పోస్టు పెట్టారు. నిశ్శబ్దంగా వుండే శక్తి పర్వతాలనైనా కదిలిస్తుందట! ఆయన వాక్యాలు ఇలా వున్నాయి. ఎవరికి వారే విశ్లేషించకుని అర్థం చేసుకుంటే మంచిది.
WE KNOW FROM SCIENCE THAT THE POTENTIAL ENERGY, THE SILENT FORM OF ENERGY, CAN MOVE MOUNTAINS BY ITS CONVERSATION TO THE KINETIC ENERGY OF MOTION. CAN WE BUILD A SCIENCE IN MOTION. PM@narendra modi
విగ్రహ ప్రతిష్టాపన బిజెపి వారే కాదు, ఇతర పార్టీల వారు కూడా పోటీపడి ప్రతిష్టిసున్నారు. ఒకరికి రాముడు కలలోకి వస్తే మరొకరికి కృష్ణుడు కలలోకి వస్తున్నాడు. అదేమిటో విచిత్రం? ఇదొక ట్రెండ్ అయిపోయింది. తెలంగాణలో రామానుజ విగ్రహం కూడా అందులో భాగమే! తమ డబ్బుకున్న నలుపు రంగు కనబడకుండా తెలుపు రంగు పులుముకునే ప్రయత్నమే అది! సైన్సుకు వున్న ప్రథమ, ప్రాథమిక లక్షణం సహనం. ఒక విషయాన్ని రుజువు చేయడానికి అది శతాబ్దాల పాటు కృషి చేస్తుంది. మతానికి మాత్రం సహనం వుండదు. అది దేన్నీ రుజువు చేయదు. పైగా క్షణాల్లో విశ్వసిస్తుంది. శతాబ్దాలు గడిచినా ఆ విశ్వాసాన్ని వదులుకోవు.
ఇది మనం అన్ని మత విశ్వాసాల్లో చూస్తున్నాం. మనువాదం ప్రచారం చేసిన వైదిక సంప్రదాయాల్లోనే కాదు, ఆటవిక, గిరిజన, జానపద సంప్రదాయాల్లో కూడా మూర్ఖత్వం పొంగి పొర్లుతూనే వుంది. జల్లికట్టు, కోడి పందాలు, సమక్క సారక్క, నాగోబా జాతర, రొట్టెల పండగ లాంటివి జనం గుడ్డిగా అనుసరిస్తున్నారు తప్ప ఈ కాలానికి ఈ సమాజానికి పనికొచ్చేవేనా? అని ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే పెరియార్ ఒకసారి అన్నారు. “దేవుడి వల్ల లాభం పొందేది ఇద్దరే ఇద్దరు. ఒకరు పూజారి. రెండు వ్యాపారి” అని! ఆయన చెప్పింది నిజమని మనకు అప్పుడప్పుడు రుజువులు కనిపిస్తున్నాయి. తిరుపతి దేవస్థానంలోని 16 మంది అర్చకుల్లో ఒకరి ఇంట్లో 128 కిలోల బంగారం, 77 కోట్ల విలువ గల ఆభరణాలు 150 కోట్ల నగదు ఆదాయపు పన్ను శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. ఇది 1 ఫిబ్రవరి 2022 నాటి వార్త. వెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా కోసం వాటిని ప్రదర్శించారు.
శక్తి గురించి, బలాల గురించి చెప్పుకున్నాం కాబట్టి మావో జెడాంగ్ చెప్పిన విషయం గూర్చి కూడా తెలుసుకోవాలి. ఆయన ఏమన్నారంటే “సరైన భావాలు, సాంఘిక ఆచరణ నుండి మాత్రమే పుట్టుకొస్తాయి. అవి ఉత్పత్తి పోరాటాలు, వర్గ పోరాటాలు, శాస్త్రీయ శోధన అనే మూడు రకాల సాంఘిక ఆచరణల నుండి మాత్రమే పుట్టుకొస్తాయి. మనిషి సాంఘిక జీవన పరిస్థితులే అతని ఆలోచనా విధానాన్ని నిర్ణయించుతాయి. పురోగాముల భావాల్ని సామాన్య ప్రజలు జీర్ణం చేసుకోగలిగితే.. ఆ భావాలే భౌతిక శక్తిగా రూపాంతరం చెందుతాయి. ఆ భౌతిక శక్తే సమాజాన్ని మార్చగలదు. ప్రపంచాన్ని కూడా మార్చగలదు.” అని ! మనం ఈ రోజు ఆలోచించవల్సింది ఈ శక్తి గురించి మాత్రమే. మానవతా దృష్టి, వైజ్ఞానిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ, తార్కిక బుద్ధి, ప్రశ్నించే ధైర్యం వుండడం అవసరమని భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. దాన్ని గౌరవించుకోవాలి కదా? భారత దేశాన్ని మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా నిలుపుకోవాలి కదా? రాజ్యాంగంలోని ఆ పదాలకు అర్థాలు మార్చే నాయకుల్ని సామాన్య ప్రజలే మట్టి కరిపించాలి! ఎంతటి నియంతృత్వపు ప్రభుత్వాన్నయినా ప్రజా బలమే దించేయగలదు! ప్రజాస్వామ్య వైజ్ఞానిక స్పృహకేతనాన్ని రెపరెపలాడించగలదు!! తాజా కలం! వర్ణ వ్యవస్థ కొనసాగాలనుకునే వారితో ఎన్నటికీ సమత సాధించబడదు.
డా. దేవరాజు- మహారాజు