దేశానికి అంకితమై సంపూర్ణ కృషి చేస్తా
ఆదివాసీ మూలాలున్న సాధారణ జీవనం నాది
అన్ని పదవుల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చా : రాష్ట్రపతి విజేత ద్రౌపదీ ముర్ము
సిమ్లా : రాష్ట్రపతి ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ద్రౌపది ముర్ము తనకు మద్దతు ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేతలకు ఆదివారం ధన్యవాదాలు తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఆమె ఆదివారం మాట్లాడుతూ దేశానికి మేలు చేసేందుకు అంకితమై సంపూర్ణంగా కృషి చేస్తానని, ఏనాడూ తప్పుడు మార్గంలో వెళ్లబోనని, ప్రజలను నిరాశ పర్చబోనని ఆమె స్పష్టం చేశారు. తనకు ముందూ వెనుక ఎవ్వరూ లేరని, కుమార్తె ఉన్నా ఆమె ఉద్యోగం చేసుకుంటున్నారని చెప్పారు. తనది సాధారణ జీవనమని, తన ఆదివాసీ మూలాలతో గర్వంగా అనిపిస్తుందని తెలిపారు. బహుశా పనితీరు వల్లనే తనకు ఎమ్‌ఎల్‌ఎగా, మంత్రిగా, గవర్నర్‌గా, ప్రస్తుతం రాష్ట్రపతిగా అవకాశాలు వచ్చాయని అనుకుంటున్నానని, తనకు ఇచ్చిన అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు. ప్రధాని మోడీ సలహాతో జార్ఖండ్ గవర్నర్‌గా గ్రామగ్రామం తిరిగి ప్రజలతో మమేకమయ్యానని తెలిపారు. గవర్నర్‌గా ఛాన్సలర్ హోదాలో యూనివర్శిటీలు, కాలేజీలు మాత్రమే కాక, పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లు కూడా సందర్శించానని చెప్పారు. విద్యార్థి దశలో పునాది బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని విద్యతోపాటు కనీస వసతుల అభివృద్ది కోసం పనిచేశానన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటారని ముర్ము తెలిపారు. ఎన్నికల కోసం బయోడేటా అడిగారని, తాను సింగిల్ పేజీలో మాత్రమే ఇవ్వగలిగానని, మిగతా వారిలా వీడియో క్లిప్ కానీ, చేసిన కార్యక్రమాల గురించి ఇతర ఫోటోలు జత చేయలేక పోయానని చెప్పారు.
Draupadi Murmu thanks to BJP Leaders for Supporting