కోల్కతా: స్కూల్ జాబ్స్ స్కాంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాల్ చేశారు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. శనివారం ఈడీ అరెస్ట్ చేశాక సీఎంకు 3 సార్లు కాల్స్ చేశారని, అయితే అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ‘అరెస్ట్ మెమో’లో పోలీసులు పేర్కొన్నారు. కాగా పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి అంటే జులై 22, 23 తేదీల మధ్య రాత్రి 2.31 ఒకసారి, 2.33కు రెండోసారి 3.37 నిమిషాలకు మూడోసారి, ఉదయం 9.35 గంటల మధ్య మరోసారి… మొత్తం 4సార్లు మమతా బెనర్జీకి ఛటర్జీ ఫోన్లు చేశారు. తమవారికి అరెస్ట్ సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వగా.. సీఎంకు కాల్ చేసేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. కాగా నిందిత వ్యక్తులు తమ అరెస్ట్ సమాచారాన్ని తెలియజేసేందుకు బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాగా పార్థ ఛటర్జీ ఫోన్ను అప్పటికే ఈడీ అధికారుల జప్తులో ఉంది.