హైకోర్టును ఆశ్రయించాలని సూచన
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు ఓటర్ ఐడీ కార్డు అనుసంధానానికి సంబంధించి ఎన్నికల చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత సూర్జేవాలా దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. జస్టిస్ డివె చంద్రచూడ్, జస్టిస్ ఎ ఎస్ బొపన్న లతో కూడిన ధర్మాసనం సూర్జేవాలా తరఫు న్యాయవాదిని మొదట ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఈమేరకు హైకోర్టుకు వెళ్లడానికి స్వేచ్ఛను కల్పించింది. సూర్జేవాలా తరఫు న్యాయవాది ఈ పిటిషన్ ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చే ఆరు నెలల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.
వేర్వేరు పిటిషన్లు దాఖలై ఉంటే కేంద్రం ట్రాన్సఫర్ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని, అప్పుడు ధర్మాసనం ఏదో ఒక హైకోర్టు ముందు ఆ విషయాలన్నిటినీ క్లబ్ చేయవచ్చని పేర్కొంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తన పరిధిలో విచారించే సమర్థవంతమైన ప్రత్యామ్నాయం ఉందని సుప్రీం ధర్మాసనం సూచించింది. పిటిషన్ దారుడు తన పిటిషన్‌లో ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం పౌరుల గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని , ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది.