న్యూఢిల్లీ: రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాళ్ల ముఠాను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అనేక చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో నింందితులుగా మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్ బంద్‌గర్, కర్నాటకలోని బెల్గామ్‌కు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూర, మొహమ్మద్ ఐజాజ్ ఖాన్‌లను నిందితులుగా సిబిఐ తన చార్జీషీట్‌లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. తనను తాను సీనియర్ సిబిఐ అధికారిగా చెప్పుకున్న బంద్‌గర్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో తనకు సంబంధాలు ఉన్నాయని, భారీ డబ్బు ముట్టచెబితే ఎటువంటి పనినైనా తాను చేయించగలనని బూర, అరోరా, ఖాన్, నాయక్‌ల వద్ద నమ్మబలికాడడని సిబిఐ ఆరోపించింది. దీంతో వీరంతా ముఠాగా ఏర్పడి రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు, వివిధ ప్రభుత్వ సంస్థలలో చైర్మన్ పదవులు, కేంద్ర ప్రభ్తువ మంత్రిత్వశాఖలు, విభాగాలలో కీలక పదవులు ఇప్పిస్తామంటూ ప్రైవేట్ వ్యక్తులకు ఎరవేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని సిబిఐ ఆరోపించింది.
CBI busts Racket false promising Rajya Sabha Seats