న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో సభా విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన హోదాకు తగినట్టు సీటును కేటాయించడంలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ అనేక మంది విపక్ష నాయకులు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఖర్గే హోదాకు తగినట్టు సీటు కేటాయించామని పేర్కొంది. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో సోమవారం 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం జరిగింది. సభావిపక్ష నాయకుని పట్ల ఉద్దేశపూర్వకంగా చూపించిన అగౌరవం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఆ లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సిపిఐ(ఎం), ఆర్‌జెడీ నేతలంతా ఆ లేఖపై సంతకాలు చేశారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. టిఎంసితో సహా విపక్షాలంతా కలిసి రాజ్యసభ చైర్మన్‌కు ఇప్పుడే లేఖ పంపామని ట్విటర్ ద్వారా తెలియజేశారు. విపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ వివరిస్తూ ప్రాధాన్యత క్రమంలో చూస్తే కేబినెట్ మంత్రుల తరువాత సభా విపక్ష నాయకుడుకు సీటు కేటాయించ వలసి ఉంటుందని, కచ్చితంగా అనుసరిస్తే ఆయన సీటు మూడో వరుసలోకి వస్తుందని, కానీ ఆయన సీనియారిటీని గౌరవించి మొదటి వరుస లోనే సీటు కేటాయించడమైందని పేర్కొన్నారు. తన సీటు మూలకు రావడంపై ఆయన అభ్యంతరం తెలపగా, అక్కడ ఉన్న సిబ్బంది మొదటివరుస మధ్యలోకి రమ్మన్నారని, కానీ ఆయన తిరస్కరించారని జోషి వివరించారు.శనివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ వీడ్కోలు సభలో ఖర్గేకు ప్రధాని తరువాతనే సీటు కేటాయించగా, ఆయన ఆరోజు రాలేదని చెప్పారు. ఈ వ్యవహారం సమస్య లేని దాన్ని సమస్యగా చేస్తున్నారని, ఇది అధ్యక్షురాలికి కూడా అవమానకరమని జోషి ఆరోపించారు. ప్రాథాన్యత క్రమాన్ని విడిచిపెట్టి మొదటి వరుస లోనే సభా విపక్ష నాయకునికి సీటు కేటాయించడానికి ప్రయత్నించామని, అదీకాక మెజార్టీ కేబినెట్ మంత్రులంతా రెండో వరుసలో కూర్చుండటం గమనించాలని పేర్కొన్నారు.
Opposition Claims Kharge Disrespected at President’s Swearing