మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సోమవారం ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభమయ్యాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలతో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభం కాగా, గాంధీ హాస్పిటల్‌లో జననల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలతో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి మెడికల్ కాలేజీ, వరంగల్ ఎంజీఎంలో సాయంత్రం క్లినిక్‌లను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో ఈవ్‌నింగ్ క్లినిక్‌లకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలు అదే రోజు నిర్వహించి రిపోర్టులు అందజేస్తారు. రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి స్పెషలిస్టు వైద్యులకు చూపించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. బోధనాసుపత్రుల్లో ఉదయం నిర్వహించే ఒపి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండి వైద్యులకు చూపించుకోలేకపోయిన వారు ఈవ్‌నింగ్ క్లినిక్‌లలో చూపించుకుంటున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు సాయంత్రం ఓపీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కోరారు.
తొలి రోజు విశేష స్పందన
బోధనాసుపత్రుల్లో ప్రారంభమైన ఈవ్‌నింగ్ క్లినిక్‌లకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఒక్కో స్పెషాలిటీ ఒపి వద్ద సుమారు 40 నుంచి 60 రోగులకు వైద్యులు చికిత్స అందించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పేద రోగులకు సాయంత్రం క్లినిక్‌లు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా ప్రభుత్వం ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభించడం పట్ల ప్రభుత్వానికి, వైద్యారోగ శాఖ మంత్రి హరీశ్‌రావుకు, వైద్యులకు రోగులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Evening Clinics Starts at Gandhi AND Osmania Hospitals