ప్రపంచ దేశాల్లో భారతదేశానికీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది. భారతీయ మూలాల్లోనే భిన్నత్వంలో ఏకత్వ భావన గలదు. సున్నితమైన మత అంశాలను ప్రజల మస్తిష్కంలో నిర్దిష్టంగా ఉంచి ఒకరి ఆచార, వ్యవహారాలను మరొకరు గౌరవించుకుని పరస్పరం ప్రేమతోజీవించే సంస్కృతి మనందరిది. రామ్, రహీం ఇద్దరూ ఒక్కటే అని హిందు ముస్లిం భాయి భాయి అనుకొని ఒకరికిఒకరు కలిసి నడిచే జీవనం మనది. భారత స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంలోనూ వ్యతిరేకశ క్తులు విభజించి పాలించు సూత్రాన్ని పాటించి మనల్ని విభజించారు.స్వార్ధ్వపూరిత ఆలోచనపరులు కొందరు ప్రజల్లోనే కొందరిని కొన్ని ఆచారాలు, సంస్కృతి పేరుతో విభజించి అందరూ ఒక్కటి అనే భావనలోంచి కొందరూ వేరనేకుటిలత్వాన్ని ప్రచారంలోకి తెచ్చారు.
రాజకీయ ప్రాబ ల్యాన్ని పెంచుకునేందుకు హిందుత్వం ముసుగులో కాషాయీకరణ, విద్వేషపు విధానాలను ప్రజల ముందుకు తెచ్చారు. మనతో కలిసి మన సంస్కృతిలో భాగంగా జీవిస్తున్న తోటివారిని మతాల పేరుతో వేరు చేసి రాజకీయంగా ఎదిగేందుకు మనుషులను చంపే కాఠిన్యానికి దిగజారారు. తాజాగా బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్య లు దేశాన్ని నిప్పుల కుంపటిలోకి తోసివేశాయి. ఈమె వల్ల అనేక దేశాల ముందు భారత ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఏకాకిని చేసేందుకు ఇస్లామిక్ దేశాలు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదులు చేశాయి. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం భారతదేశంలో ముస్లింలను వేధింస్తున్నారని ప్రకటించడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఇరాన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలన్నీ భారత దేశ వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ వ్యవహారంతో గల్ఫ్ దేశాలు- ఇండియా మధ్య బంధం బలహీనపడే ప్రమాదాలు సైతం కనిపిస్తున్నాయి. కువైట్ పర్యటన సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి అక్కడి ప్రభుత్వం నోటీసులు అందచేసిందంటే పరిస్థితిని ఏలా ఉందో అర్డం చేసుకోవచ్చు. పరిస్థితి చెయ్యిదాటి పోవడంతో దేశ ప్రజల ముందు ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందోనని భయపడి నష్ట నివారణ చర్యల్లో భాగంగా నుపూర శర్మను పార్టీ నుంచి తొలగించామని, అలాగే ఆమెకు మద్దతుగా మాట్లాడిన బిజెపి ఢిల్లీ మీడియా అధికారిక చీఫ్ నవీన్ కుమార్ జిందాల్‌పై వేటు వేశామని బిజెపి ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉన్నది.
నుపూర్ శర్మ వ్యాఖ్యలు భారత ప్రభుత్వ ఆలోచనలని, బిజెపి అధికార దురహంకారం అనే ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది. భారత లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బిజెపి కించపరుస్తూనే ఉంది. బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల గల్ఫ్ దేశాలు భారత దేశానికి పెట్రోలియం ఉత్పత్తులను నిలిపి వేసే పరిస్థితి నెలకుంది. ఇదే జరిగితే శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఆకలి చావులు భారతదేశంలోనూ చోటు చేసుకోవా! దీనికి ఎవరు బాధ్యత వహించాలి. నుపూరశర్మ, నవీన్ కుమార్ జిందాల్‌పై చర్యలు తీసుకున్న బిజెపి నాయకత్వం తెలంగాణలో ముస్లింలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చకొడుతున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నది. తెలంగాణలో మసీదులను తవ్వుదామని బాధ్యతారాహిత్యంగా ఆయన చేస్తున్న మత విద్వేష ప్రసంగాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. అధికారం కోసం అడ్డమైన మాటలు మాట్లాడుతూ ప్రజలలో మత చిచ్చు పెడుతారా.. రెచ్చకొట్టి ప్రజల జీవితాలలో ఆడుకుంటారా.. ఉర్దూను బ్యాన్ చేయాలని విద్యార్థులను రోడ్లపైకి తెస్తారా.
దీనితోపాటు అడ్డమైన మాటలను అడ్డదిడ్డమైన వాదనలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మత సహనంపై కారుచిచ్చురేపుతూ ప్రజల్లో విద్వేషపు బీజాలను నాటి ఏం సాధింస్తారు. ప్రజలు నిట్టనిలువున చీలిపోయి,దేశాలే విడిపోయిన సంగతీ మరిచారా. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం నుపూర్ శర్మ వ్యాఖ్యలు, తదనంతర పరిస్థితులపై జోక్యం చేసుకుంది అంటే బిజెపి మత విద్వేషాలను ఏ స్థాయిలో రెచ్చగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం 19 (ఎ) అందరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించింది. కానీ పరమతాలను కించపరుస్తూ రాజకీయ పబ్బం గడుతామంటే సరికాదు. ప్రజల మధ్య అగ్గిరాజేసి, కత్తులతో మత యుద్ధాలు చేసుకునేంత దుర్మార్గాలకు దారితీయరాదు.
డా. బొల్లికొండ వీరేందర్
9866535807