మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ ఎడిసిపి వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్, కాశిబుగ్గ, పద్మానగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్ పంచర్‌షాపులో పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద తక్కువ ధరకు ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా చూశాడు. అతడి వద్ద తక్కువ డబ్బులకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. అతడి వద్ద నుంచి పది రోజుల క్రితం 4 కిలోల గంజాయిని రూ.11,100కు కొనుగోలు చేశాడు. దానిని తీసుకుని సికింద్రాబాద్‌లో అవసరం ఉన్న వారికి 100 గ్రాములకు రూ.500లకు విక్రయించాలని వచ్చాడు. కాని కొనుగోలు చేసేవారు కన్పించలేదు, ఈ నెల 26వ తేదీ ఉదయం మహంకాళీ టెంపుల్ సమీపంలో కొందరికి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు సాయిఈశ్వర్ గౌడ్, కోటయ్య, ఎస్సై శ్రవణ్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.