దక్షిణ కన్నడ జిల్లాలో ఉద్రిక్తత
మంగళూరు: బిజెపి యువమోర్చ కమిటీ సభ్యుని హత్యతో బుధవారం దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక చోట్ల తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అనేక ప్రాంతాలలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు పోలీసుల లాఠీచార్జి ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. యువ మోర్చ కార్యకర్త హత్యకు నిరసనగా పుత్తూరు, కడబ, సులియా తాలూకాలలో బంద్‌కు సంఘ్ పరివార్ పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి బళ్లారిలోని నెట్టారులో బైకులో వచ్చిన ముగ్గురు దుండగులు బిజెపి జిల్లా యువ మోర్చ కమిటీ సభ్యుడు ప్రవీణ్ నెట్టార్‌ను ఆయన బ్రాయిలర్ షాపు ఎదుటే కత్తితో నరికి చంపివేశారు. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియచేయగా ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ సంఘటనతో జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. పుత్తూరు నుంచి మంగళూరుకు వెళుతున్న బస్పును బోల్వర్ వద్ద ఆందోళనకారులు ధ్వంసం చేశారు.