Saturday, November 23, 2024

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట

- Advertisement -
- Advertisement -

Tirumala Srivari Brahmotsavam Vahana Sevalu 2022

అన్ని ర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు

జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీతో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష‌

తిరుమ‌ల‌: క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు మాడ వీధుల్లో నిర్వ‌హించ‌నుండ‌డంతో పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంద‌ని, అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, ఇత‌ర టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ…. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, ఇందులో ప్ర‌ధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. పెర‌టాసి మాసం మూడో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో త‌మిళ‌నాడు భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశ‌ముందని, ర‌ద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల‌నే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామ‌న్నారు. కేవలం స‌ర్వ‌దర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశామ‌ని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామ‌ని వివ‌రించారు. స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌న్నారు.

భ‌ద్ర‌త ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని ఈవో వెల్ల‌డించారు. రెండు రోజుల క్రితం టిటిడి సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి సంయుక్తంగా మాడ వీధుల్లో త‌నిఖీలు నిర్వ‌హించి చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై చ‌ర్చించార‌ని చెప్పారు. భ‌ద్ర‌త అవ‌స‌రాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేర‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌న్నారు. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామ‌ని, అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో సిసి కెమెరాల నిఘా ఉంటుంద‌ని చెప్పారు.

గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని, జ‌న‌రేట‌ర్లు కూడా సిద్ధంగా ఉంచుకుంటామ‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులను ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేసుకుంటామ‌ని వెల్ల‌డించారు. వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని, నిర్దేశిత ప్రాంతాల్లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అంబులెన్సుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు. .

భ‌క్తుల‌కు ర‌వాణాప‌రంగా ఇబ్బందులు లేకుండా ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ముఖ్యంగా గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు న‌డుపుతామ‌ని చెప్పారు. ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా చూసేందుకు వీలుగా గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తామ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ద‌ర్శించే శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో విభిన్న క‌ళారూపాల‌ను, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హణ‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. జిల్లాస్థాయిలో అన్ని విభాగాల‌ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పూర్తి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, మ‌రోసారి ఈవోతో స‌మావేశం నిర్వ‌హించి దాన్ని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ఈసారి గ‌రుడ‌సేవ‌కు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో, ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేకంగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌న్నారు.

తిరుప‌తి జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశముంద‌ని, ఇందుకు అనుగుణంగా భ‌ద్ర‌త‌ప‌రంగా ఎలాంటి రాజీకి తావులేకుండా బందోబ‌స్తు ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంది కావున క్యూలైన్లు వెలుప‌లికి వచ్చే అవ‌కాశం ఉంద‌ని, క్యూలైన్ల వ‌ద్ద కూడా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా, ట్రాఫిక్‌, పార్కింగ్ ప‌రంగా ఇబ్బందులేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) స‌దా భార్గ‌వి, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో ష‌ణ్ముఖ కుమార్‌, శ్రీవారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు వేణుగోపాల దీక్షితులు, గోవింద‌రాజ దీక్షితులు, కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ముఖ్య అర్చ‌కులు కిర‌ణ్ స్వామి, అద‌న‌పు ఎస్పీ మునిరామ‌య్య‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, వేంక‌టేశ్వ‌ర్లు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ చెంగ‌ళ్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News