ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి, జోనల్ కమిషనర్లకు మేయర్ ఆదేశం
హైదరాబాద్: ఎడతెరపి లేని వరసవర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. నగరవాసులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జిహెచ్‌ఎంసి చేపడుతున్న సహాయ చర్యలపై జోనల్ కమిషనర్లతో గురువారం మేయర్ టెలీ (సెల్) కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గత 4 రోజల నుండి కురుస్తున్న వర్షాల నేపథ్యం లో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు నాలలు, మ్యాన్‌హోల్స్ వద్ద పేరుకొని పోయిన చెత్త, మట్టి తొలగించి సాఫీగా వరద పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. ప్రజల పిర్యాదు లు అందిన తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులందరూ 24 గంటల పాటు అందుబాటు ఉంటూ క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, వర్షాలు, వరదల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైన అదే స్ఫూర్తి ఎదుర్కునే ందుకు సిద్దంగా ఉండాలని మేయర్ అధికారులకు సూచించారు. మూసీ నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం లో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు రాబోయే 24 గంటలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ స్తంబాలు, చెట్ల , నాలా పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్పబయటకు రావద్దని సూచించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూం 040-21111111, డిఆర్‌ఎప్ 040-29555500 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.