స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ’సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత అశ్వినీదత్‌తో ఇంటర్వూ విశేషాలు…
ఆ కోరిక తీరింది…
సీతారామం సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. ‘సీతారామం’తో ఆ కోరిక తీరింది. బాలచందర్ ‘మరో చరిత్ర’, మణిరత్నం ‘గీతాంజలి’ చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది.
థియేటర్‌కి రావాలంటేనే భయపడుతున్నారు
సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. వారిని థియేటర్‌కు రప్పించడం ఇప్పుడు సవాలుగా మారింది. ప్రేక్షకులు థియేటర్‌కి రావడం తగ్గడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావచ్చు. అలాగే చాలా థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి. ఇక ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్ ధరలు పెంచారనేది అవాస్తవం. |
ఆ క్రెడిట్ స్వప్నకే…
మా ఇద్దరు పిల్లలు చదువు పూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా వుంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్లో తీశారు. నేను షూటింగ్‌కి వెళ్ళలేదు. ‘సీతారామం’ మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.
అది దేవుడు ఇచ్చాడని భావిస్తా…
నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్‌ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. “మీరు ఎదురుగా వుంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ”అని మహదేవన్ అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం వుంది. ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్‌ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్‌గా చేశారు.
విజువల్ వండర్లా…
హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. అతనికి కెమెరాపై అద్భుతమైన పట్టు వుంది. ‘సీతారామం’ని ఒక విజువల్ వండర్లా తీశారు. కాశ్మీర్‌తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్లు ఇందులో విజువల్ ఫీస్ట్‌గా వుంటాయి.
అందుకే దుల్కర్‌ను తీసుకున్నాం…
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టికి నేను పెద్ద అభిమానిని. “ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం”అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్‌గా రీచ్ వుండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు.
తదుపరి చిత్రాలు…
నాగచైతన్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో వున్నాయి. అన్నీ మంచి శకునములే సినిమా అక్టోబర్ 5న విడుదలవుతుంది.
Ashwini Dutt Interview about ‘Sita Ramam’