హైదరాబాద్: మునుగోడు ప్రజలను ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బిజెపితోనే అభివృద్ధి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? అని, ఎన్నికల్లో గెలిచాక కనిపించకుండా పోయావు అని దుయ్యబట్టారు.
మునుగోడులో తాము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని బడుగుల తెలిపారు. సిఎం కెసిఆర్‌ను విమర్శించే స్థాయి రాజగోపాల్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణ ప్రజలు సిఎం కెసిఆర్ వెంటే ఉన్నారన్నారు. అన్నిరంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులకు భరోసా కల్పించామని, మునుగోడు ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలు ఓడించడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే అని జోస్యం చెప్పారు.