ఈ గ్రామాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్రం
దేశవ్యాప్తంగా 24,680 గ్రామాల ఎంపిక
ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు రూ.26,316 కోట్లు
హైదరాబాద్: దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మండలి దేశవ్యాప్తంగా 4జీ మొబైల్ సేవలు అందుబాటులో లేని గ్రామాలకు ఆ సేవలను విస్తరించే ప్రాజెక్టుకు రెండురోజుల క్రితం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.26,316 కోట్లు కాగా, దేశవ్యాప్తంగా ఉన్న- 24,680 మారుమూల ప్రాంతాలకు 4జి సేవలను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోని 425 గ్రామాలను ఈ సేవల కింద ఎంపిక చేసింది.
24,680 మారుమూల ప్రాంతాల్లోని….
24,680 మారుమూల ప్రాంతాల్లోని క్లిష్టమైన గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా 4జీ మొబైల్ సేవలను కేంద్రం అందించనుంది.- పునరావాసం, నూతన ప్రాంతాలు, ఇప్పటికే ఉన్న ఆపరేటర్ల సేవలు ఉపసంహరించిన స్థానాల్లో 20శాతం అదనపు గ్రామాలను చేర్చాలన్న నిబంధనలను ఈ ప్రాజెక్టుల్లో చేర్చడంతో తెలంగాణలోని పలు గ్రామాలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. వీటికి అదనంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 2జీ/3జీ సేవలు కలిగి ఉన్న 6,279 గ్రామాలను సైతం 4 జీ సేవలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. గత సంవత్సరంలో ప్రభుత్వం 5 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 7,287 గ్రామాల్లో 4జీ సేవలు ఏర్పాటు కోసం ప్రాజెక్టును ఆమోదించింది. ఈ ప్రాజెక్టును ఆత్మనిర్భర్ భారత్ 4 జీ సాంకేతికతను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుండగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ద్వారా ఫండ్ ద్వారా నిధులను కేంద్రం సమకూరుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్
బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే ఆత్మనిర్భర్ 4జీ సాంకేతికత ఏర్పాటును అమలు చేస్తుండగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కూడా దీనిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ల క్ష్యానికి అనుగుణంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వివిధ ప్రభుత్వ ఈ-గవర్నన్స్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలి మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్రం భావిస్తోంది.
తెలంగాణలో ఎంపికైన ప్రాంతాలు ఇలా…
తెలంగాణలో ఎంపికైన ప్రాంతాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 53 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 41 గ్రామాలు, జగిత్యాల జిల్లాలో 1, జయశంకర్ భూపాలపల్లిలో 26 గ్రామాలు, కామారెడ్డిలో 1, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 159 గ్రామాలు, మహబూబాబాద్ జిల్లాలో 34 గ్రామాలు, మంచిర్యాల జిల్లాలో 7 గ్రామాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ములుగులో 45 గ్రామాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 8 గ్రామాలు, నల్లగొండలో 15 గ్రామాలు, నారాయణపేటలో 2, నిర్మల్‌లో 21 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాలో 4, రంగారెడ్డిలో 2, సంగారెడ్డిలో 1, వనపర్తిలో 1, వరంగల్ అర్భన్‌లో 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 గ్రామాల్లో 4 జీ సేవలను ‘అంత్యోదయ’ కార్యక్రమం కింద కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.