కొద్ది మందికే అందుబాటులో కోర్టులు
మెజారిటీ ప్రజల మౌన వేదన
సిజెఐ ఎన్‌వి రమణ ఆవేదన
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో రావడం సామాజిక చైతన్యానికి ప్రతీకగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అభివర్ణించారు. జనాభాలో స్వల్ప శాతం మందికి మాత్రమే న్యాయస్థానాలు అందుబాటులో ఉంటున్నాయని, అత్యధిక ప్రజలు చైతన్యం లేక, ఆర్థిక వనరులు లేక మౌనంగా వేదనను అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ అఖిల భారత జిల్లా న్యాయ సేవా సంస్థల సమావేశాన్ని ఉద్దేశించి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రసంగిస్తూ సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చిందని, దీన్ని ఉపయోగించి కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయవ్యవస్థను కోరారు. సమాజంలోని అసమానతలను నిర్మూలించే లక్షంతోనే ఆధునిక భారతదేశ నిర్మాణం జరిగిందని, ప్రజలందరి భాగస్వామ్యమే ప్రజాస్వామ్యం ప్రధాన ఆశయమని ఆయన అన్నారు. సామాజిక చైతన్యం లేకుండా ప్రజలందరి భాగస్వామ్యం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అండర్ ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తూ ఇందుకు న్యాయ సేవా సంస్థల జోక్యం, చొరవ మరింత క్రియాశీలకం కావాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు.
Most Indians Unable to approach Court: NV Ramana