న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఐటి రిటర్న్(ఐటిఆర్)దాఖలు చేయడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. అయితే, శుక్రవారం వరకు 4.52 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు దాఖలు చేశారని ఆదాయం పన్ను విభాగం శనివారం తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 43 లక్షలకు పైగా ఐటిఆర్‌లు దాఖలయ్యాయని వెల్లడించింది. ఇప్పటికైతే ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి గడువు పొడిగించే యోచనేమీ లేదని తేల్చి చెప్పింది.
గడువులోపు ఐటిరిటర్న్ సబ్మిట్ చేయాలని పన్ను చెల్లింపుదారులను కోరుతూ ఆదాయం పన్ను విభాగం ట్విట్టర్ వేదికగా అప్పీల్ చేసింది. ‘మీరు కూడా ఐటిఆర్ దాఖలు చేశారనే భావిస్తున్నాం. ఒకవేళ ఐటిఆర్‌లు సబ్మిట్ చేయకుంటే దయచేసి ఇప్పుడైనా దాఖలు చేయండి. 2022-23 అంచనా సంవత్సరం (2021-22) ఐటిఆర్ దాఖలు చేయడానికి తుది గడువు 2022 జూలై 31’ అని ట్వీట్ చేసింది. ఐటిఆర్‌ల దాఖలు ప్రక్రియను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి), కేంద్ర ఆర్థికశాఖ పర్యవేక్షిస్తున్నాయని ఐటి అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు ఐటిఆర్‌ల దాఖలు ప్రక్రియలో సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులతో ‘వార్ రూమ్’ 24 గంటల పాటు అందుబాటులో ఉందని ఐటి అధికారి ఒకరు పిటిఐకి చెప్పారు. వార్ రూమ్‌తోపాటు సిబిడిటి సోషల్ మీడియా టీం ఎప్పటికప్పుడు ఐటిఆర్‌లు దాఖలు చేసే వ్యక్తులు, ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని, ప్రతిస్పందనలను సేకరిస్తుందన్నారు.
ఈ-ఫైలింగ్ పోరల్‌లో పన్ను చెల్లింపుదారులకు వచ్చే ప్రతి సమస్యపైనా ప్రతిస్పందిస్తూ వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఐటిఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్లు.. వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను సిబిడిటికి పంపుతున్నట్లు ఐటి విభాగం అధికారి తెలిపారు. కానీ గడువు వరకు సజావుగా ఐటి ఫైలింగ్స్ సాగడంపైనే దృష్టి సారించామన్నారు. ఇప్పటికైతే ఐటిఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించే ఉద్దేశం లేదన్నారు. గురువారం వరకు 4.08 కోట్ల ఐటిఆర్‌లు దాఖలయ్యాయి. వాటిలో 3.09 కోట్ల ఐటిఆర్‌లు వెరిఫై అయ్యాయని ఐటీ అధికారులు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సుమారు 5.89 కోట్ల ఐటిఆర్‌లు సబ్మిట్ అయ్యాయి.
ITRs Filed deadline ends on July 31st