కోల్‌కతా: అర్పితా ముఖర్జీ నివాసాలలో దొరికిన డబ్బు, నగలు తనవి కావని బర్తరఫ్‌కు గురైన పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. రాష్ట్రంలో టీచర్ల నియామకాల భారీ స్కామ్‌కు సంబంధించి ఇడి భారీ స్థాయిలో సోదాలు దాడులు నిర్వహించింది. ఈ దశలో మాజీ మంత్రి ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండు మూడు ఫ్లాట్లలో రూ. 50 కోట్ల వరకూ నగదు, నగలు లభ్యం అయ్యాయి. ఛటర్జీ, ముఖర్జీలను ఇడి వర్గాలు అరెస్టు చేసి విచారిస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని స్థానిక ఆసుపత్రికి ఉద్వాసనకు గురైన మంత్రిని తీసుకువచ్చారు. ఈ దశలో ఆయన విలేకరులతో కొద్ది సేపు మాట్లాడారు. ఇప్పటి స్కామ్ అరెస్టులు ఇతర అంశాలపై స్పందించాలని విలేకరులు కోరారు. ఎవరైనా కుట్రపన్నారని అనుమానిస్తున్నారా? అని అడిగారు. కుట్ర ఇతర విషయాలు సమయం వచ్చినప్పుడు అందరికీ తెలిసివస్తాయని ఆయన ముక్తసరిగా జవాబిచ్చారు. అయితే అక్కడ దొరికిన సొమ్ము అయితే తనది కాదని, తనకు ఆ డబ్బుకు ఎటువంటి లింక్ లేదని స్పష్టం చేశారు. ముఖర్జీ నివాసాలలో దొరికిన సొమ్ము విషయంపై ఏమంటారు? అనే అంశంపై ఆయన స్పందించారు. అర్పితా ముఖర్జీ నివాసాలలో దొరికిన నోట్ల కట్టలు, భారీ నగలు వజ్రాలు వైఢూర్యాలు కళ్లు తిరిగేలా చేశాయి. ఈ డబ్బు అంతా మంత్రిదే అని, తన నివాసాలను వాడుకున్నారని అర్పిత ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఇప్పుడు ఛటర్జీ ఈ నగదు నగలు తనవి కావని చెపుతున్నారు. దీనితో ఇప్పుడు ఈ సొమ్ము, నగలు సంగతి ఏమిటనేది ప్రశ్నార్థకం అయింది.
అంతా మమత పనే..ఇతరులు కీలుబొమ్మలే
టీచర్లస్కాంపై దాడి పెంచిన బిజెపి
రాష్ట్రంలో మాయని మచ్చగా మారుతోన్న టీచర్ల స్కాంలో కీలక బిందువు ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీయే అని బిజెపి మరోసారి విమర్శించింది. ఇప్పుడు ఈ స్కామ్‌లో వస్తున్న పేర్లు పాత్రధారులవి అని, ప్రధాన సూత్రధారి అంతా ఆమె అని బిజెపి ఆరోపించింది. మంత్రి స్వయంగా కుట్ర జరిగిందని చెపుతున్నారు. బలి పశువును అయ్యానని అంటున్నారని, సిఎంకు, పార్టీ అధినేత్రికి తెలియకుండా పార్టీలోని వారు ఇంతటి భారీ కుంభకోణం చేస్తారా? తెలియకుండా చేస్తే మమతకు ఇక అధికార నిర్వహణపై పట్టు లేదని అనుకోవాలా? అని బిజెపి ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
That’s not my money says Partha Chatterjee