Monday, December 23, 2024

గొటబాయ తిరిగిరాకకు ఇది సరైన సమయం కాదు

- Advertisement -
- Advertisement -

గొటబాయ తిరిగిరాకకు ఇది సరైన సమయం కాదు
శ్రీలంక సంక్షోభం ఇప్పట్లో తీరేది కాదు
అధ్యక్షుడు విక్రమసింఘె వ్యాఖ్యలు

కొలంబో: శ్రీలంక మాజీఅధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వదేశానికి తిరిగిరావడానికి ఇది అనుకూల సమయం కాదని ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె తెలిపారు. చరిత్రలోనే మొట్టమొదటిసారి అత్యంత ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు గొటబాయ ఇప్పుడు తిరిగిరావడం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యక్షుని నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో రాజపక్స దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి ఆయన సింగపూర్‌కు వెళ్లారు. అనంతరం జులై 20న పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్ ద్వారా శ్రీలంక నూతన అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘె బాధ్యతలు చేపట్టారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి గొటబాయ, ఆయన కుటుంబ సభ్యులే కారణమని దేశ ప్రజలు భావిస్తున్నారని, ఈ సమయంలో ఆయన దేశానికి తిరిగిరావడం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వూలో విక్రమసింఘె తెలిపారు.

శ్రీలంకకు త్వరలో తిరిగిరావాలని భావిస్తున్నట్లు గొటబాయ తనకు సూచించలేదని కూడా ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముగియడానికి మరికొంత కాలం పట్టవచ్చని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)తో చర్చలు సఫలమైతే సమస్యకు పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులైన ఆహారం, ఇంధనం, వంటగ్యాసు, మందుల కోసం బారులుతీరి వేచిచూస్తున్న ప్రజల కష్టాలు తీరడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.

President Wickremesinghe about Sri Lanka Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News