ఢిల్లీలో వేలాది మంది బిసిల భారీ ప్రదర్శన
హైదరాబాద్ : పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంపి ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులగణన చేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది బిసిలు మంగళవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. పార్లమెంటు వైపు దూసుకెళ్తున్న బిసి నాయకులు, కార్యకర్తలను జంతర్‌మంతర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఈ ప్రధర్శనలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా పార్లమెంటు సభ్యులు ఆర్. కృష్ణయ్య, వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, బడుగు లింగయ్య తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు, జాతీయ బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఎనగాల నూకలమ్మ, తెలంగాణకు చెందిన శ్రీనివాస్‌లు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుద్దేశించి ఆర్. కృష్ణయ్య ప్రసంగించారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టే వరకు బిసి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని ఆర్ కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెట్టకపోతే తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి ఇదే సరైన సమయమని ఆయనన్నారు. ప్రధాని నరేంద్ర మోడి బిసి వర్గానికి చెందిన వారని ఈ సమయంలోనే బిసి బిల్లు ప్రవేశపెట్టడానికి మంచి అవకాశమని ఆయన చెప్పారు. బిసి లందరు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.