అల్‌ఖైదా చీఫ్‌ను మట్టుబెట్టిన అమెరికా
కాబుల్‌లోని ఇంటిపై R9x
క్షిపణితో దాడి
పక్కా ప్లాన్‌తోనే
ఆపరేషన్
దాడిని స్వయంగా
పర్యవేక్షించిన
అమెరికా
అధ్యక్షుడు
అధికారికంగా
ప్రకటించిన బిడెన్
ఆరు నెలలు నిఘా
రహస్య ఆయుధంతో
దాడి
ఫలించిన
20ఏళ్ల వేట
అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాది అల్ జవహరిని ఆ దేశ సైనిక దళాలు శనివారం మట్టుబెట్టాయి.9/11 ఉగ్రదాడితో అగ్రరాజ్యాన్ని వణికించిన జవహరి ఎట్టకేలకు హతమయ్యాడు.
వాషింగ్టన్ : అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడి జరిపి హతమార్చింది.అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికాసైన్యానికి గతవారం అనుమతి ఇచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి జవహరిని హతమార్చారు. ఈ దాడిలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బై డెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. ఈ దాడిలో జవహరి ఒక్కడే మృతి చెందగా అదే ఇంటిలో ఉన్న అతని భార్య, కుమార్తెలు, మనవళ్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
2001లో అమెరికాలో ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్‌తో పాటుగా అల్ జవహరి ముఖ్య సూత్రధారి. ఆ దాడుల్లో 3000కు పైగా అమెరికన్లు మృతి చెందారు. అప్పటినుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా జవహరి పరారీలో ఉన్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ జరిపి మట్టుబెట్టింది అమెరికాసైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవహరిని కూడా అదే రీతిలో కడతేర్చింది. ఆ తర్వాత జవహరి అల్‌ఖైదా పగ్గాలు చేపట్టాడు. జవహరిపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇదివరకే ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయంగా చెప్పవచ్చు.అల్‌ఖైదా మృతితో ఇకపై అఫ్గానిసస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ ప్రకటించారు.
‘హెల్‌ఫైర్’ క్షిపణి ప్రత్యేకతలు
వాషింగ్టన్ : అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని మట్టుబెట్టడానికి జరిపిన డ్రోన్ దాడిలో ఉపయోగించిన రహస్య ఆయుధం( క్షిపణి) ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిగురించి ఇప్పటివరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘హెల్‌ఫైర్’గా పిలవబడే ఈ క్షిపణి అయిదడుగులకు పైగా పొడవు, కేవలం 100 పౌండ్లు( 45 కిలోల ) బరువు మాత్రమే ఉంటుంది. కానీ లక్షాన్ని ఛేదించడంలో మాత్రం దీనికి తిరుగులేదు. ఎలాంటి వార్‌హెడ్‌లు లేని ఈ క్షిపణికి ఉండే బ్లేడ్లు భవనాలు, కార్ల పైకప్పులను చీల్చుకు పోయి చుట్టపక్కల ఉండే వ్యక్తులకు, ఆస్తులకు ఎలాంటి హానీ కలిగించకుండా టార్గెట్‌ను మాత్రమే మట్టుబెడతాయి. పైగా ఎలాంటి పేలుడు కూడా సంభవించదు. దీన్ని ‘నింజాబాంబ్’గా కూడా పిలుస్తారు. ఉగ్రవాద నేతలను హతమార్చడం కోసం మాత్రమే అత్యంత తరచుగా ఈ క్షిపణిని ఉపయోగించే సిఐఎ దీనికి సంబంధించిన వివరాలను కూడా చాలా రహస్యంగానే ఉంచింది.