బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే ధీమా
కోల్‌కత: ఈ ఏడాది డిసెంబర్ నాటికి పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలులోకి వచ్చే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే అసిమ్ సర్కార్ శుక్రవారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి శరణార్థ విభాగం చైర్మన్ అయిన సర్కార్ శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సిఎఎ అమలులోకి రానున్నదని అన్నారు. రాష్ట్ర శరణార్థ విభాగం చైర్మన్‌గా సిఎఎపై తనకు కొన్ని సూచనలు అందాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా సిఎఎ అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
సరిహద్దు జిల్లాలలోని హిందూ శరణార్థుల ఆకాంక్షలు సిఎఎ అమలు ద్వారా నెరవేరుతాయని ఆయన చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల లోగా సిఎఎ అమలుకాని పక్షంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థులలో నెలకొన్న అసంతృప్తి తీరబోదని ఆయన అన్నారు. ఇలా ఉండగా&రాష్ట్రంలో సిఎఎ అమలుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోరని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తప్పుడు ప్రకటనల ద్వారా వలసదారులను తప్పుదారి పట్టించడానికి అసిమ్ సర్కార్ వంటి బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓటు వేసినవారంతా ఈ దేశ పౌరులేనని ఆయన స్పష్టం చేశారు.